Toddler Dies After Falling Into Hot Milk: పాపం బిడ్డ.. పోరాడి ప్రాణాలు విడిచింది..!
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:10 PM
అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 17 నెలల చిన్నారి వేడి వేడి పాల గిన్నెలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంతపురం, సెప్టెంబర్ 26: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముక్కు పచ్చలారని చిన్నారి.. వేడి వేడి పాల గిన్నెలో పడి ప్రాణాలు కోల్పోయింది. సెప్టెంబర్ 20వ తేదీన బుక్కరాయసముద్రం మండలం కోరపాడు సమీపంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి తాజాగా ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణ వేణి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీన కృష్ణవేణి తన వెంట తన 17 నెలల కూతురు అక్షితను తీసుకువచ్చింది. కృష్ణవేణి డ్యూటీకి రిపోర్ట్ చేసి.. చిన్నారిని ఆడుకోవడానికి సమీపంలో వదిలేసింది. ఈ క్రమంలో గదిలో అటూ ఇటూ తిరుగుతూ అక్షిత ఆడుకుంటోంది. కృష్ణవేణి తన డ్యూటీలో తాను నిమగ్నమైపోయింది. అయితే, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. అక్షిత గదిలో తొలుత ఓవైపు వెళ్లింది. కాసేపటికి తన తల్లి ఉన్న వంట గది వైపు వచ్చింది. అయితే, వంట గది బయట వేడి వేడిగా మరిగించిన పాల గిన్నె పెట్టారు. ఆ పాలను గమనించి ఓ పిల్లి గిన్నె వైపు వచ్చింది. ఆ పిల్లి వెనుకాలే అక్షిత కూడా వచ్చింది. పిల్లిని చూసి భయపడిన అక్షిత.. దానిని చూసుకుంటూ వెనకవైపు నడిచింది. ఈ క్రమంలో వేడి పాల గిన్నెలో పడిపోయింది.
సలసల కాగుతున్న పాల గిన్నెలో అక్షిత పూర్తిగా మునిగిపోయింది. ఆ వేడికి తట్టుకోలేక అక్షత పెద్ద పెట్టున కేకలు పెట్టింది. గిన్నెలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా తన వల్ల కాలేదు. అక్షిత అరుపులు విన్న కృష్ణవేణి పరుగు పరుగున వచ్చి.. పాల గిన్నెలో పడిన అక్షితను బయటకు తీసింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్షిత శరీరం పూర్తిగా కాలిపోవడంతో.. వైద్యులు చిన్నారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ అక్షిత ప్రాణాలు కోల్పోయింది.
కాగా, చిన్నారి అక్షిత పాల గిన్నెలో పడిపోవడం, కృష్ణవేణి వచ్చి చిన్నారిని బయటకు తీయడానికి సంబంధించిన దృశ్యాలన్నీ వంట గదిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Chanakya Niti Life Lessons: ఈ నాలుగు విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడకండి..
Cheapest Clothing Market: ఈ మార్కెట్‌లో తక్కువ ధరకే మంచి డ్రెస్సులు కొనుగోలు చేయవచ్చు..!