Share News

Anantapur : 20 వేల మందితో హనుమాన్‌ చాలీసా పారాయణం

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:03 AM

హనుమాన్‌ చాలీసా పారాయణ ప్రచార సమితి ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు.

Anantapur : 20 వేల మందితో హనుమాన్‌ చాలీసా పారాయణం

  • అనంతపురంలో సామూహిక పఠనం

అనంతపురం కల్చరల్‌, జనవరి 4(ఆంధ్రజ్యోతి): హనుమాన్‌ చాలీసా పారాయణ ప్రచార సమితి ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో శనివారం సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు. రాజమహేంద్రవరం జోన్‌ కమాండెంట్‌ ఎస్పీ డాక్టర్‌ కొండా నరసింహరావు దంపతులు శంఖారావంతో చాలీసా పారాయణను ప్రారంభించారు. ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో పాటు దాదాపు 20 వేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏకకాలంలో చాలీసాను పఠించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి మహాస్వామి, భగవద్గీత ఫౌండేషన్‌ చైర్మన్‌ బ్రహ్మశ్రీ గంగాధరశాస్త్రి హాజరై.. హనుమాన్‌ చాలీసా సారాంశాన్ని వివరించారు. హనుమాన్‌ చాలీసా పఠనం వల్ల బుద్ధి వికసిస్తుందని, ధైర్యం వస్తుందని, మనోవికాసం పొందుతామని ఉపదేశించారు. అనంతరం సామూహిక హనుమాన్‌ చాలీసా పఠనంలో పాల్గొన్న విద్యార్థులందరికీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

Updated Date - Jan 05 , 2025 | 05:03 AM