Pawan Win Vow: పవన్ గెలుపు మొక్కు తీర్చుకున్న 96 ఏళ్ల అవ్వ
ABN , Publish Date - May 06 , 2025 | 05:34 AM
పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు తన మొక్కు తీర్చుకుంది. పింఛను డబ్బుతో అమ్మవారికి గరగ చేయించి సమర్పించింది
కొత్తపల్లి, మే 5(ఆంధ్రజ్యోతి): ఆ వృద్ధురాలికి జనసేన పార్టీ అంటే ఎనలేని అభిమానం. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు.. ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కావడంతో సోమవారం మొక్కు తీర్చుకుంది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు జనసేన పార్టీకి, పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని. 2024లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో.. గ్రామంలోని వేగులమ్మ తల్లికి పొర్లుదండాలు పెట్టింది. పవన్‌ను గెలిపించాలని, ఆయన గెలిస్తే అమ్మవారికి గరగ చేయించి సమర్పిస్తానని మొక్కుకొంది. తనకు వచ్చే పింఛను సొమ్ములో రూ.2,500 చొప్పున పోగు చేసింది. ఈ నెలతో రూ.27వేలు కాగా, ఆ సొమ్ముతో అమ్మవారికి గరగ చేయించి సోమవారం సమర్పించింది. పవన్‌కల్యాణ్‌తో కలిసి బువ్వ తినాలని ఉందని, ఆ బువ్వ తన పింఛను డబ్బుతోనే తయారు చేస్తానని చెప్పింది.