Liquor Policy Scam: మద్యం దోపిడీ కోట్లు 3200
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:19 AM
మద్యం పాలసీ మార్పులతో రూ.3200 కోట్ల దోపిడీ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి, అవినీతి దందా నడిపినట్లు స్పష్టం అయ్యింది.
దోచుకునేందుకే పాలసీ మార్చారు
ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారు
రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ‘సిట్’
అమరావతి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ‘మద్యం పాలసీ’ మార్పుతో జగన్ హయాంలో రూ.3200 కోట్ల దోపిడీ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. మద్యం ఉత్పత్తి కంపెనీలకు అయాచిత లబ్ధిని చేకూర్చి... తిరిగి వాటి నుంచే నెలనెలా ముడుపులుగా వసూలు చేశారని... ఈ కేసులో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ‘సిట్’ పేర్కొంది. దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సమాచారం, లభించిన ఆధారాలు... తాము అరెస్టు చేసిన వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇతరులు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి మద్యం కుంభకోణంపై ‘సిట్’ ఒక స్పష్టతకు వచ్చింది. దాన్నే కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో సవివరంగా ప్రస్తావించింది. మరిన్ని వివరాలు..
కసిరెడ్డే కుట్రదారు
రూ.3200 కోట్ల దోపిడీలో నాటి జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిదే కీలక పాత్ర. ఇందులో... మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీలు కూడా భాగస్వాములు. ముడుపుల ఆధారంగా మద్యం కంపెనీల సరఫరా, అమ్మకాలను శాసించారు. 2014-19లో అమలైన మద్యం పాలసీ పారదర్శకంగా ఉంది. దీని వల్ల ఆదాయం పెరిగింది. మద్యం ఉత్పత్తి బ్రాండ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. కానీ... కొత్త మద్యం పాలసీవల్ల ప్రముఖ బ్రాండ్లు ఏపీ మార్కెట్ నుంచి కనుమరుగయ్యాయి. ముడుపులిచ్చేందుకు అవి అంగీకరించకపోవడంతో సరఫరాకు ఆర్డర్లు ఇవ్వలేదు.
కసిరెడ్డి దందానే వేరు
ఎస్‌పీవై ఆగ్రో (డిస్టిలరీ)ను బెదిరించి దాన్ని రాజ్ కసిరెడ్డి తన నియంత్రణలోకి తీసుకున్నారు. అదాన్ డిస్టిలరీ్‌సను తీసుకురావడంలో కసిరెడ్డిదే కీలక పాత్ర. మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచి తన మనుషుల ద్వారా వసూలు చేసిన ముడుపులను మిథున్ రెడ్డికి కొంత కాలం పంపించారు. ఆ తర్వాత ఓఎస్డీ కృష్ణమోహన్‌రె డ్డి, బాలాజీకి చేరవేశారు. వరుణ్ అనే వ్యక్తిని ముందు ఉంచి లీలా బ్రాండ్‌ను కసిరెడ్డే నిర్వహించారు. ఇంకా ఈశ్వరీ ఇన్‌ఫ్రాపై కన్నేయడంతోపాటు అనేక చోట్ల భూములు కొని పెట్టుబడులు పెట్టారు.
2022 సంవత్సరంలో మద్యం కల్తీ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం అమ్మిన మద్యం తాగి అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు. కొందరు మరణించారు. దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ లిక్కర్ సిండికేట్ వల్లే ఈ దారుణాలు జరిగినట్లు ఆధారాలు నిరూపిస్తున్నాయి.
ముడుపుల ప్రవాహం ఇలా...
1) బంగారం, షేర్ మార్కెట్ ఖాతాలకు ముడుపుల సొమ్మును జమ చేసేవారు.
2) ముడుపుల సొమ్మును కొన్ని కంపెనీలు కసిరెడ్డి సూచించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టాయి. మరికొన్ని... తెలివిగా తమ రంగంలోని లిక్కర్ కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టాయి.
3) వందల కోట్లలో ఉన్న ముడుపులను షెల్‌కంపెనీలకు మళ్లించారు. హవాలా మార్గంలో దేశ, విదేశాలకు దారి మళ్లించారు. ఇందులో భాగస్వాములైన వారి నెట్‌వర్క్‌కు రాజకీయ పార్టీతో ఉన్న లింకుల గురించి మరింత లోతుగా విచారణ జరుగుతోంది.
4) ముడుపుల చెల్లింపులకు ముడి సరుకు సరఫరా చేసే సంస్థలనూ వాడుకున్నారు. ఉదాహరణకు... సీసాలు, కార్టన్ బాక్సుల వంటి సరఫరా సంస్థలకు లెక్కప్రకారం కోటి రూపాయలు చెల్లించాలనుకుంటే, 15 కోట్లు ఇచ్చేవారు. కోటి ఆ కంపెనీకి, మిగిలిన 14 కోట్లు దొడ్డిదారిన కసిరెడ్డి టీమ్‌కు చేరేవి.
5) ముడుపుల సొమ్మును వ్యాపార ప్రమోషన్‌ల పేరిట దొంగ ఖాతాలకు దారి మళ్లించేలా కసిరెడ్డి ప్లాన్ చేయించారు. తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం... మరో ప్రచార కంపెనీకి డబ్బులు చెల్లించినట్లు చూపే వాళ్లు. ఇందుకోసం అనేక షెల్ కంపెనీలను, నకిలీ ఇన్‌వాయి్‌సలు పుట్టించారు. అదంతా చివరికి రాజ్ కసిరెడ్డి చేతికే వచ్చేది.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..