Share News

Telugu Cyber Scandal: లైవ్‌లో అశ్లీల వీడియోలు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:36 AM

నిషేధిత వెబ్‌సైట్‌లలో మహిళల నగ్న వీడియోలు లైవ్‌ ప్రసారం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు బెంగళూరు కేంద్రంగా, మరొకరు గుంతకల్లులో ఈ అశ్లీల దందా నడిపినట్లు అధికారులు తెలిపారు.

Telugu Cyber Scandal: లైవ్‌లో అశ్లీల వీడియోలు

  • నిషేధిత వెబ్‌సైట్‌కు అమ్ముతున్న ముఠా

  • బెంగళూరు కేంద్రంగా ఇద్దరు.. గుంతకల్లులో మరొకరు దందా

  • పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్న ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ

గుంటూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నిషేధిత అశ్లీల వెబ్‌సైట్‌లో మహిళల నగ్న వీడియోలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురి గుట్టురట్టయింది. రెండేళ్లుగా ఈ అశ్లీల దందా నిర్వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన గణేశ్‌, జ్యోత్స్న, గుంతకల్లుకు చెందిన లూయి్‌సలను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వారి దందా వివరాలను ఈగల్‌ చీఫ్‌, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌చార్జ్‌ ఐజీ ఆకే రవికృష్ణ గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో వివరించారు. గణేశ్‌, జ్యోత్స్న డిగ్రీ చదువుకొని సులువుగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించారు. బెంగళూరు కేంద్రంగా సైప్రస్‌ దేశానికి చెందిన నిషేధిత ఎక్స్‌హ్యామ్‌స్టర్‌ వెబ్‌సైట్‌ ద్వారా మహిళల నగ్న వీడియోలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. గుంతకల్లులో కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న లూయిస్‌ అనే వ్యక్తి కూడా ఈ అశ్లీల వీడియోల దందా నిర్వహిస్తున్నాడు. ఈ ముగ్గురికి వెబ్‌సైట్‌ నిర్వాహకులు క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌లో చెల్లింపులు చేస్తే.. వాటిని డాలర్లలోకి, ఆపై రూపాయల్లోకి మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు బెంగళూరుకు చెందిన ముఠా రూ. 16 లక్షలు, లూయిస్‌ రూ. 11 లక్షలు సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది. తమకు అందినసమాచారం మేరకు సీఐడీ సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ కృష్ణ ప్రసన్న ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బెంగళూరులోని గణేశ్‌, జ్యోత్స్న స్టూడియోపై దాడి చేసి లైవ్‌ స్ట్రీమింగ్‌ పరికరాలు, వెబ్‌ కెమెరాలు, పోర్న్‌ వీడియోల డేటా సీజ్‌ చేశారు. ఇక్కడ ప్రస్తుతానికి ముగ్గురు మహిళా బాధితులను గుర్తించారు.


ఈ ముఠాపై ఇప్పటివరకు మూడు ఫిర్యాదులు నమోదయ్యాయని, దర్యాప్తు కొనసాగుతోందని, ఎంత మంది బాధితులు ఉన్నారనేది త్వరలోనే తెలియజేస్తామని ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సైబర్‌ క్రైమ్‌ బాధితులు 1930కు ఫిర్యాదు చేయొచ్చు

ప్రజలు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆకే రవికృష్ణ సూచించారు. ఇటీవల బెట్టింగ్‌ యాప్స్‌, డిజిటల్‌ అరె్‌స్టలు, ఓటీపీ ఫ్రాడ్‌ తదితర ఆర్థిక నేరాలు జరుగుతున్నాయన్నారు. అందువల్ల వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్‌ నేరాలకు సంబంధించి 1930 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. న్యాయం జరగని పక్షంలో మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి రావచ్చన్నారు. సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెడితే పదేళ్ల తరువాత అయినా అరెస్టు కాక తప్పదని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌, గంజాయి వంటి మాదక పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వాటిపై ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా 1972 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉందన్నారు. ప్రిస్కిప్షన్‌ లేకుండా మత్తు మందులను విక్రయించవద్దని మందుల షాపులకు సూచించారు. తల్లిదండ్రులూ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశంలో ఎస్పీ కృష్ణ ప్రసన్న, డీఎస్పీ గోలి లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 04:39 AM