Share News

AP High Court: 15 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి పెన్షన్‌ పునరుద్ధరణ సరైందే

ABN , Publish Date - May 04 , 2025 | 04:41 AM

రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యుటేషన్‌ పెన్షన్‌ విధానం కింద 15 ఏళ్ల పాటు సొమ్ము రికవరీ చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. ఈ తీర్పు ప్రకారం, 15 సంవత్సరాల అనంతరం పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించలేదు.

AP High Court: 15 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి పెన్షన్‌ పునరుద్ధరణ సరైందే

  • కమ్యుటేషన్‌ పింఛన్‌ విధానం గురించి ఉద్యోగులకు తెలుసు: హైకోర్టు

  • రిటైర్డ్‌ ఉద్యోగుల వ్యాజ్యాలు కొట్టివేత

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు కమ్యుటేషన్‌ పెన్షన్‌ విధానం కింద ఏకమొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల పాటు రికవరీ చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. వేతన కమిషన్‌ సిఫారసు మేరకు సొమ్ము రికవరీ కాలాన్ని 15ఏళ్లుగా నిర్ణయించారని పేర్కొంది. పూర్తిస్థాయి పెన్షన్‌ పునరుద్ధరణకు 15ఏళ్ల వ్యవధిని కేంద్రం అనుసరిస్తోందని గుర్తుచేసింది. కమ్యూటెడ్‌ పెన్షన్‌ రూపంలో ఏకమొత్తంలో తీసుకున్న సొమ్ముకు అసలుతో పాటు వడ్డీని 11 సంవత్సరాల 3 నెలల పాటు ప్రభుత్వం రికవర్‌ చేస్తే సరిపోతుందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. 15ఏళ్ల అనంతం పూర్తి పెన్షన్‌ పునరుద్ధరణకు వీలుకల్పిస్తున్న ఏపీ సివిల్‌ పెన్షన్‌ రూల్స్‌లోని నిబంధన 18ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు తమకు వచ్చే పెన్షన్‌ సొమ్ములో కమ్యుటేషన్‌ పెన్షన్‌ కింద ఏకమొత్తంగా ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం 15ఏళ్ల పాటు రికవరీ చేశాకే పూర్తిస్థాయి పెన్షన్‌ పునరుద్ధరణకు వీలుకల్పిస్తున్న ఏపీ సివిల్‌ పెన్షన్‌ రూల్స్‌లోని నిబంధన 18ని సవాల్‌ చేస్తూ పలువురు రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఏకమొత్తంలో ముందస్తుగా తీసుకున్న సొమ్మును 11 ఏళ్ల 3 నెలలపాటు రికవర్‌ చేస్తే సరిపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 15 ఏళ్లపాటు రికవరీ చేశాక పూర్తిస్ధాయి పెన్షన్‌ను పునరుద్ధరించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపిస్తూ.. పెన్షన్‌ సంక్షేమ పథకంలో భాగమని, దీర్ఘకాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక భద్రత కల్పించేందుకు ఉద్దేశించిందన్నారు. ఉద్యోగులు ఎలాంటి సొమ్మును చెల్లించరని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పెన్షన్‌ సొమ్మును చెల్లిస్తుందన్నారు. పదవీ విరమణ చేసే సమయంలో ఉద్యోగులే స్వచ్ఛందంగా కమ్యుటేషన్‌ పెన్షన్‌ విధానాన్ని ఎంచుకుంటున్నారని తెలిపారు. దీనిలోని నిబంధనలు వారికి ముందే తెలుసునని చెప్పారు. కమ్యుటేషన్‌ పెన్షన్‌ విధానంలో ఉద్యోగులు ప్రయోజనాలు పొందుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం... కమ్యుటేషన్‌ పెన్షన్‌ కింద ఏకమొత్తంలో ముందస్తుగా తీసుకుంటున్న సొమ్ముకు ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు, ఇతర ప్రయోజనాలు పొందుతున్నారని గుర్తు చేసింది. పూర్తి పెన్షన్‌ను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరిస్తారని తెలుసుకున్నాకే ఉద్యోగులు కమ్యుటేషన్‌ పెన్షన్‌ విధానాన్ని ఎంచుకుంటున్నారని స్పష్టం చేసింది. ఒకవైపు కమ్యుటేషన్‌ పెన్షన్‌ విధానంలో ప్రయోజనాలు పొందుతూ మరోవైపు రూల్‌ 18ని సవాల్‌ చేయడం సరికాదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది.

Updated Date - May 04 , 2025 | 04:42 AM