Share News

ఏడు సెకన్లలోనే గుండె గుట్టు..!

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:54 AM

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఓపీ విభాగంలో రోగులకు రెండు రోజులుగా గుండె జబ్బుల స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏడు సెకన్లలోనే గుండె గుట్టు..!

  • ఏఐ బేస్డ్‌ యాప్‌తో మాస్‌ కార్డియాక్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష

  • గుంటూరు జీజీహెచ్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహణ

  • యాప్‌ను రూపొందించిన 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్‌

గుంటూరు మెడికల్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి ఓపీ విభాగంలో రోగులకు రెండు రోజులుగా గుండె జబ్బుల స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే.. కార్డియాలజి్‌స్టలకు బదులు 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్‌ నంద్యాల.. ఈ పరీక్షలు నిర్వహించడం.. అదికూడా స్మార్ట్‌ ఫోన్‌తో చేయడం అందరినీ ఆకర్షించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అతడు స్వయంగా రూపొందించిన.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో పనిచేసే సిర్కాడియావీ అనే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి ఉంది. స్మార్ట్‌ ఫోన్‌ను రోగి ఛాతీపై ఏడు సెకన్లపాటు ఉంచితే ఈ యాప్‌ హృదయ స్పందనను రికార్డు చేస్తుంది. రోగికి గుండె జబ్బు ఉంటే బీప్‌ సౌండ్‌తో రెడ్‌ లైట్‌ వెలిగి గ్రాఫిక్‌లో ‘అబ్‌నార్మల్‌ హార్ట్‌ బీట్‌’ అనే పదాలు స్ర్కీన్‌పై కనిపిస్తున్నాయి. జీజీహెచ్‌ ఓపీలో దాదాపు 500 మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయగా, వారిలో పది మందికి గుండె జబ్బులు ఉన్నట్లు ఈ యాప్‌ తేల్చింది. వీరిని వార్డుకు తరలించి.. ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయగా.. ఆశ్చర్యకరంగా అందరికీ గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కాగా, అనంతపురానికి చెందిన సిద్ధార్థ్‌ కుటుంబం 2010లో అమెరికాలో స్ధిరపడింది. తండ్రి మహేశ్‌ అమెరికాలో వ్యాపారవేత్త. సిద్ధార్థ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (డల్లా్‌స)లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఏఐ బేస్డ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో సిర్కాడియావీ అనే యాప్‌ను ఆవిష్కరించాడు. ఆ యాప్‌తో అమెరికాలో 15 వేల మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయగా.. 3,500 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించింది. 93 శాతం కచ్చితత్వంతో పనిచేసే ఈ యాప్‌ సాయంతో ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో స్ర్కీనింగ్‌ పరీక్షలు చేశారు. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఇటీవల డల్లా్‌సలో కలిసిన సిద్ధార్థ్‌ ఆయన చొరవతో ఇక్కడికొచ్చి స్ర్కీనింగ్‌ పరీక్షలకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నాడు. వెయ్యి మందికి పరీక్షలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని సిద్ధార్థ్‌ గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


సీఎం చంద్రబాబును కలవాలని ఉంది: సిద్ధార్థ్‌

ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సర్టిఫైడ్‌ ఏఐ టెకీగా గుర్తింపు పొందిన సిద్ధార్థ్‌ ఏఐ సాయంతో రూపొందిన తన ప్రాజెక్ట్‌ గురించి సీఎం చంద్రబాబును కలసి వివరించాలని ఉందని తెలిపాడు. అయితే సీఎం అపాయింట్‌మెంట్‌ ఇంకా దొరకలేదని చెప్పాడు. ‘పలు అమెరికా కంపెనీలు మా ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉన్నాయి. అయితే మాకు డబ్బు ముఖ్యం కాదు. సొంత రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఆశయంతో భారత్‌కు వచ్చాం’ అని సిద్ధార్థ్‌ తండ్రి మహేశ్‌ తెలిపారు.

Updated Date - Mar 14 , 2025 | 04:54 AM