Adilabad: స్టేషన్‌కు పిలిపించారనే మనస్తాపంతో.. ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:10 AM
పోలీసులు స్టేషన్‌కు పిలిపించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్దికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

నేరడిగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీసులు స్టేషన్‌కు పిలిపించారనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్దికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సింగం సాయిచరణ్ (23) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 25న గ్రామ శివారులో గల పోచమ్మ ఆలయం వద్ద జరిగిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యాడు. మద్యం మత్తులో అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్‌లను సాయిచరణ్ అతడి స్నేహితులు పగలగొట్టారు. దీనిపై గ్రామపెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎస్సై శ్రీకాంత్ రెండ్రోజుల క్రితం సదరు యువకులను పిలిపించి లైట్లు ఎందుకు పగలగొట్టారని విచారించారు.
పగలగొట్టిన లైట్‌లను ఏర్పాటు చేయిస్తామని యువకులు ఒప్పుకోవడంతో.. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని ఎస్సై వారిని హెచ్చరించాడు. అయితే పోలీసులు స్టేషన్‌కు పిలిపించడంతో సాయిచరణ్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గత ఆదివారం అర్ధరాత్రి పనిమీద బయటకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సోమవారం బుద్దికొండ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం లభ్యమైంది. తన కొడుకు మృతికి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారణమని ఆరోపిస్తూ సాయిచరణ్ కుటుంబీకులు సోమవారం గ్రామంలో ఆందోళన చేశారు. తన కొడుకును పోలీసు స్టేషన్‌కు పిలిపించడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.