Share News

‘వంద’ కేంద్రంగా ప్రచారం..

ABN , Publish Date - Apr 20 , 2024 | 07:24 AM

‘రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనపై రెఫరెండం’.. ఇది సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన. ‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలిచ్చింది. ఈ 100 రోజుల్లో వాటిని నెరవేర్చనే లేదు’- ఇది బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శ.

‘వంద’ కేంద్రంగా ప్రచారం..

- 100 రోజుల పాలనపైనే రాష్ట్రంలో మూడు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు

- ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్న కాంగ్రెస్‌

- బూటకపు హామీలను చూసి జనం మోసపోయారని బీఆర్‌ఎస్‌ విమర్శ

- అవినీతి బీఆర్‌ఎస్‌ పోయి అవినీతి కాంగ్రెస్‌ వచ్చిందంటున్న బీజేపీ

(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి)

‘రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనపై రెఫరెండం’.. ఇది సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన. ‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలిచ్చింది. ఈ 100 రోజుల్లో వాటిని నెరవేర్చనే లేదు’- ఇది బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శ. ‘అవినీతి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. అయినా 100 రోజుల్లో హామీలు అమలు కాలేదు. అవినీతి దూరం కాలేదు’- ఇదీ బీజేపీ ఆరోపణ. మొత్తమ్మీద రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల ప్రచారం వంద రోజుల చుట్టే తిరుగుతోంది. జరిగేవి లోక్‌సభ ఎన్నికలైనా.. రాష్ట్రంలో పరిస్థితులే ఎన్నికల ఎజెండా కావడం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గతేడాది డిసెంబరు 7వ తేదీన కొలువుదీరింది. ఏప్రిల్‌ 17వ తేదీ నాటికి నాలుగు నెలల 10 రోజుల కాలాన్ని పూర్తి చేసుకున్నది. ఇంత తక్కువ సమయంలో హామీలను సంతృప్త స్థాయిలో అమలు చేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాని పని. కానీ.. ఇంతలోనే లోక్‌సభ ఎన్నికలు వచ్చి పడ్డాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం. దాని కోసం ఎలాంటి అవకాశం అందివచ్చినా జారవిడుచుకోవు. అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఎన్నికలకు అనుగుణంగా విమర్శలు, ప్రతి విమర్శలకు సిద్ధపడతాయి. దీనికి తగినట్లుగానే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ స్పందిస్తున్నాయి. 100 రోజుల కాంగ్రెస్‌ పాలనే కేంద్రంగా ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్‌ చెబుతోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్నామని, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించామని, ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇన్ని పథకాలను అమలు చేస్తున్నామని, లోక్‌సభ ఎన్నికల్లో ఇవే తమకు శ్రీరామ రక్ష అని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ హామీలకు తోడు, సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా.. ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇతర హామీలను కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. ఎక్కడికెళ్లినా 100 రోజుల పాలన చూసి ఓట్లేయమని అడుగుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండమ్‌ లాంటివని ధైర్యంగా ప్రకటించారు. అదేసమయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీపై సీఎం ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఐదు లోక్‌సభ స్థానాలను గెలిపించి ఇవ్వాలంటూ బీఆర్‌ఎ్‌సకు బీజేపీ సుపారీ ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. అయినప్పటికీ, ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో పెద్దగా సీట్లు రావని, 17 లోక్‌సభ స్థానాల్లో 14 సీట్లను తామే గెలవబోతున్నామని ఘంటాపథంగా చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తే... మరింత ఉత్సాహంతో పని చేయడానికి వీలవుతుందని పేర్కొంటున్నారు.

తూర్పారబడుతున్న విపక్షాలు

ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కాంగ్రెస్‌ 100 రోజుల పాలనను తూర్పారపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన హామీలను 420 హామీలంటూ ఎద్దేవా చేస్తూ.. ప్రజలు ఆ హామీలను చూసి మోసపోయారని, మళ్లీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మోసపోవద్దని బీఆర్‌ఎస్‌ పిలుపునిస్తోంది. ‘అంతులేని హామీలతో కాంగ్రెస్‌ గెలిచింది. వాటిని నెరవేర్చేవరకు వెంటాడి వేటాడుతాం. రాష్ట్రంలో సరిగా కరెంటు ఉండటం లేదు. తాగు నీటికీ కటకటే. హామీలపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇటీవల పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేదని, మతం పేరిట దేశంలో చిచ్చు పెట్టి ఓట్లు అడగటం తప్ప బీజేపీకి ఎలాంటి ప్రచారాస్త్రం లేదని కేసీఆర్‌ విమర్శిస్తున్నారు. మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కాంగ్రెస్‌ 100 రోజుల పాలన మీదనే ధ్వజమెత్తటం గమనార్హం. ఇచ్చిన హామీల్లో వేటినీ కాంగ్రెస్‌ సరిగా అమలు చేయలేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తుక్కుగూడ సభలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా... మళ్లీ అదే తుక్కుగూడలో సభ పెట్టి కొత్త హామీలను గుప్పించారని విమర్శిస్తోంది. పాత హామీలకే దిక్కులేదు, కొత్త హామీలతో ముందుకొస్తున్న కాంగ్రె్‌సను ఆదరిస్తే అంతే సంగతి అంటూ ప్రజలను హెచ్చరిస్తోంది. అవినీతిని అరికడతామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ హయాంలో అవినీతి ఏమాత్రం తగ్గలేదని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణకు మోదీ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని, పలు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చిందని, ముద్ర రుణాలు అందిస్తున్నామని ప్రచారం చేస్తోంది.

జాతీయ మేనిఫెస్టోలను పక్కన పెట్టి..

బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ జాతీయ పార్టీలు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆ రెండు పార్టీలు మేనిఫెస్టోలను రూపొందించి ఇప్పటికే విడుదల చేశాయి. కాంగ్రెస్‌ ‘పాంచ్‌న్యాయ్‌ పచ్చీస్‌ గ్యారెంటీ’ పేరుతో మహిళలు, యువత, రైతులు, కార్మికులు, సామాజిక న్యాయం వారీగా పలు హామీలను ప్రకటించింది. పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థికసాయం, నిరుద్యోగ యువతకు ఒక ఏడాదిపాటు ఉద్యోగ శిక్షణ.. ఆ సమయంలో రూ.లక్ష వేతనం, మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌, ఆర్థికంగా వెనకబడిన అన్ని కులాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌, కులగణన, రిజర్వేషన్లలో ప్రస్తుతం అమలవుతున్న 50 శాతం పరిమితి తొలగింపు, రైతులకు చట్టబద్ధంగా మద్దతుధర, ఉపాధిహామీ పథకం రోజువారీ వేతనం రూ.400కు పెంపు వంటి పలు ఆకర్షణీయ హామీలను ప్రకటించింది. మరోవైపు బీజేపీ ‘సంకల్ప్‌పత్ర్‌: మోదీ కి గ్యారెంటీ’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. గ్యాన్‌ (గరీబ్‌, యువ, అన్నదాత, నారీ - పేదలు, యువత, రైతులు, మహిళలు)లోని నాలుగు వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ పలు హామీలను ప్రకటించింది. దేశంలోని 3 కోట్ల మంది ప్రజలకు పక్కా గృహాలను నిర్మించి ఇస్తామని, 70 ఏళ్లు దాటినవారికి రూ.5 లక్షల ఉచిత వైద్యాన్ని అందిస్తామని, మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌ను సరఫరా చేస్తామని, దక్షిణాదికి బుల్లెట్‌ రైలును ఇస్తామని, ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తామని, పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ను అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, దేశంలోని ఆయా రాష్ట్రాల్లో జాతీయ స్థాయి మేనిఫెస్టోల ఆధారంగానే కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. కానీ, తెలంగాణకు వచ్చేసరికి వాటి వ్యూహం మారిపోయింది. ఇక్కడ100 రోజుల పాలన కేంద్రంగానే ఈ రెండు జాతీయపార్టీలూ ప్రచారం నిర్వహిస్తున్నాయి.

Updated Date - Apr 20 , 2024 | 07:24 AM