Road Accident: అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొని ఇద్దరి మృతి
ABN , Publish Date - Dec 23 , 2024 | 05:01 AM
కంటైనర్ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
పటాన్‌చెరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కంటైనర్ అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. మచిలీపట్నానికి చెందిన అశోక్‌కుమార్ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఉంటూ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన.. భార్య శ్యామల(27), అన్న కొడుకు గణేశ్(17)తో కలిసి సంగారెడ్డిలోని బంధువుల ఇంటికి స్కూటీపై బయలుదేరారు.
ఈ క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ భారీ కంటైనర్ ఇస్నాపూర్ సమీపంలో స్కూటీని ఢీకొట్టింది. ముగ్గురూ రోడ్డుపై పడిపోగా శ్యామల, గణేశ్ పైనుంచి కంటైనర్ చక్రాలు వెళ్లడంతో వారిద్దరూ మృతి చెందారు. స్కూటీ నడుపుతున్న అశోక్‌కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.