Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ పనైపోయింది..
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:04 AM
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అది గ్రామ స్థాయి నాయకుల కృషి ఫలితమేనని చెప్పారు.
కాంగ్రెస్ సర్కారు రావడానికి గ్రామస్థాయి నేతలే కారణం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించిన వారికి పదవులు: మహేశ్ గౌడ్
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పనైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అది గ్రామ స్థాయి నాయకుల కృషి ఫలితమేనని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించడానికి కృషి చేయాలని గ్రామస్థాయి నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన వారికి పదవులు దక్కుతాయన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు రాచమళ్ల సిద్ధేశ్వర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమావేశంలో మహేశ్‌గౌడ్ మాట్లాడారు. గ్రామ పంచాయతీలంటే రాజీవ్‌గాంధీకి చాలా ఇష్టమని, రాజ్యాంగానికి ఆయన 73, 74 సవరణలు తెచ్చి గ్రామాలకు హక్కులు కల్పించారన్నారు. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని, చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలూ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లోపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఓ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశాన్ని కాంగ్రెస్ కాపాడుతుంటే.. బీజేపీ అమ్మేస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించి సంస్థను ఇంకా బలోపేతం చేయాలన్నారు. సంఘటన్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో పంచాయతీ రాజ్ సంఘటన్ చాలా బలంగా పని చేస్తోందని, జాతీయ స్థాయిలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఇక్కడ ఆచరణలో పెట్టారని కితాబిచ్చారు. స్పౌజ్ బదిలీలపై ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా ఇంకా అవి అమల్లోకి రాలేదని, వెంటనే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహేశ్‌గౌడ్‌ను ఉపాధ్యాయులు కోరారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని మహేశ్‌గౌడ్ వారికి హామీనిచ్చారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం: కుంభం అనిల్
మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వనుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ వెల్లడించారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనపైన హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా హరీశ్‌రావు అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటిదాకా మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక్క ఇంటిని కూడా కూల్చలేదని, కొందరు స్వచ్ఛందంగా ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు వెళ్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణలో హరీశ్ చేసిన దాష్టీకాలు అన్నీ, ఇన్నీ కావన్నారు. గత ప్రభుత్వ హయాంలో 36 మంది గురుకులాల విద్యార్థులు పాముకాటుకు గురై మరణించినప్పుడు, అజీర్తితో అనేక మంది ఆసుపత్రి పాలైనప్పుడు పట్టించుకున్నారా అంటూ బీఆర్‌ఎస్ నేతలను టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ నిలదీశారు. గురుకులాల్లో కాస్మొటిక్, డైట్ చార్జీల పెంపుతో ప్రభుత్వం పట్ల విద్యార్థుల్లో పెరుగుత్ను అభిమానం చూసి తట్టుకోలేకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎ్‌సలో కేటీఆర్, హరీశ్‌రావుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, అందుకే అధ్యక్ష పదవి కోసం గోబెల్స్ ప్రచారంలో పోటీ పడుతున్నారని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో పర్యాటక, రోడ్ల అభివృద్ధి, ఎంబీసీ, మత్స్య కార్పొరేషన్ల చైర్మన్లు పటేల్ రమేశ్‌రెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, జైపాల్, సాయికుమార్ మాట్లాడుతూ.. రేవంత్ నాయకత్వాన్ని బలహీన పరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. సర్కారు చేసే మంచి పనులపై సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని.. ఇందుకు నెలకు రూ.3 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.