Medak: చోరీ ఎత్తు.. మత్తులో చిత్తు!
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:19 AM
అర్ధరాత్రి చాకచాక్యంగా వైన్ షాపులో దూరిన ఓ దొంగ.. తెలివిగా సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. దొరికిన కాడికి కౌంటర్‌లో నగదును సర్దేసుకున్నాడు.
మద్యం షాపులో దొంగతనానికి వెళ్లి తాగేసి పడుకున్న దొంగ
యజమాని ఫిర్యాదుతో అరెస్టు
చేగుంట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి చాకచాక్యంగా వైన్ షాపులో దూరిన ఓ దొంగ.. తెలివిగా సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. దొరికిన కాడికి కౌంటర్‌లో నగదును సర్దేసుకున్నాడు. తిరిగివెళ్దామనుకునే సరికి.. మద్యం బాటిళ్లను చూసి మైమరిచిపోయాడు.. ఇంకెముంది.. ఫుల్లుగా తాగేసి అక్కడే పడుకుండిపోయాడు. ఉదయం యజమాని వచ్చి చూసి పోలీసులకు సమాచారమివ్వగా, వారు వచ్చి అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి షాపును మూసేసి యజమాని ఇంటికి వెళ్లగానే.. కాచుకొని కూర్చున్న దొంగ పైకప్పు రేకులను కోసేసి షాపులోకి దిగాడు.
అక్కడున్న డబ్బులను సర్దుకుని పెట్టుకున్నాడు. మద్యం బాటిళ్లు కనపడగానే మనసొప్పక ఫుల్‌గా తాగి మత్తులో నిద్రపోయాడు. యజమాని రోజూలాగే ఉదయం వైన్స్ తెరవగా, లోపల దొంగ పడుకుని కనిపించాడు. పక్కనే డబ్బులు ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. నార్సింగి ఎస్సై అహ్మద్ మొహినొద్దీన్ సిబ్బందితో వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో స్పృహ కోల్పోయి ఉన్న అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.