Share News

Election Commission: మంత్రి సురేఖపై ఎన్నికల సంఘం ఆగ్రహం

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:43 AM

రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖపై శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీరియస్‌ అయింది.

Election Commission: మంత్రి సురేఖపై ఎన్నికల సంఘం ఆగ్రహం

  • కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీరియస్‌

  • స్టార్‌ కంపెయినర్‌గా బాధ్యతతో మెలగాలని హితవు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): కొండా సురేఖ ఈ నెల 1వ తేదీన వరంగల్‌లో మీడియా సమావేశంలో కేటీఆర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఈ నెల 6న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, దాసోజు శ్రవణ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌గారు మీ కుమారుడు కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి కొంతమంది అధికారులు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం అయ్యారు. చివరికి ఆ అధికారులు జైలు శిక్ష అనుభవించే పరిస్థితికి తెచ్చాడు. హీరోయిన్లను బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.


ఇక సమయం ఆసన్నమైంది. కేటీఆర్‌ గారు కాస్త జాగ్రత్త. ఇప్పటికే మీ చెల్లెలు శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లింది. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో దర్యాప్తు సాగుతోంది. మీ కుట్రలు అన్నీ బయటికి వస్తాయి ‘‘ అని అన్నారని బీఆర్‌ఎస్‌ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఆధారాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. కొండా సురేఖను మందలించింది. ప్రత్యర్థులపై ఆరోపణలు చేసే సమయంలో బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతతో ఉండాలని హితవు పలికింది.

Updated Date - Apr 27 , 2024 | 05:06 AM