High Court: ఇందిరమ్మ కమిటీల జీవోపై స్టేకు హైకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:49 AM
ఇళ్ల పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది.

హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 33పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ జీవోకు సంబంధించి వివరణ సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మించాలని సంకల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 11న జీవో జారీచేసింది. అయితే చట్టప్రకారం గ్రామసభ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని, అవి కాకుండా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం చెల్లదని పేర్కొంటూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కొలిపాక మండలం కొత్తపల్లికి చెందిన ఆరే నితీశ్‌కుమార్ తదితరులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.
సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ విచక్షణపై ఆధారాపడి ఉంటుందని, దాంట్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌లను కొట్టేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై పిటిషనర్‌లు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ కే శరత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫు న్యాయవాది ఎస్. సంతో్‌షకుమార్ వాదిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఇచ్చుకునేందుకు ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా ఇందిరమ్మ కమిటీలను తెరపైకి తెచ్చారని, గ్రామసభను విస్మరించారని పేర్కొన్నారు. తుది తీర్పు వచ్చే వరకు ఆ జీవోపై స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డి వాదిస్తూ పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగేందుకే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.