Hyderabad: డ్రగ్స్ సరఫరాదారులపై మెరుపు దాడి
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:07 AM
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది.

హైదరాబాద్‌లో పక్కా సమాచారంతో రంగంలోకి టీజీన్యాబ్, పోలీసులు
8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బృందాలు
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక దాడులు నిర్వహిస్తోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్), సైబరాబాద్ పోలీసులు ఆదివారం రాత్రి నగరంలోని పలు పబ్‌లు, బార్లతోపాటు వివిధ ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారులు మాదాపూర్‌లో సమావేశం కానున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ మెరుపు దాడిలో 14 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 8 మంది గంజా, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలు వినియోగించినట్టు తేలిందని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని టీజీన్యాబ్ సూచించింది. డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.