Telangana Assembly: 7 రోజులు.. 38 గంటలు!
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:30 AM
శాసనసభ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. తెలంగాణ తల్లి ఆవిర్బావ ఉత్సవంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో మొదలైన సమావేశాలు.. శనివారం రైతు భరోసాపై స్పల్పకాలిక చర్చ తర్వాత నిరవధికంగా వాయిదా పడ్డాయి.

వాడీవేడిగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
తెలంగాణ తల్లి ఆవిర్భావోత్సవ ప్రకటనతో షురూ
ఆఖరి రోజున రైతు భరోసాపై చర్చతో ముగింపు
భూభారతి సహా 8 బిల్లులకు ఆమోదం
హైదరాబాద్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): శాసనసభ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. తెలంగాణ తల్లి ఆవిర్బావ ఉత్సవంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో మొదలైన సమావేశాలు.. శనివారం రైతు భరోసాపై స్పల్పకాలిక చర్చ తర్వాత నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ భూ భారతి సహా 8 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 7 రోజుల్లో సుమారుగా 38 గంటల పాటు సమావేశాలు జరగ్గా.. సీఎం, మంత్రులతోపాటు 71 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్.. యథాప్రకారం శీతాకాల సమావేశాలకూ హాజరు కాలేదు. వాస్తవానికి డిసెంబరు 9న సమావేశాలు ప్రారంభం కాగా.. తెలంగాణ తల్లి ఆవిర్భావ ఉత్సవంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. తిరిగి 16న ప్రారంభమైన సమావేశాలు.. శనివారం వరకూ కొనసాగాయి. 16న.. ఆ తర్వాత లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్‌ఎస్ పట్టు పట్టింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
అయితే, వివిధ బిల్లులకు ఆమోద ముద్ర వేయడానికి సమావేశమైన క్యాబినెట్.. ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క సారిగా ఫార్ములా-ఈ కేసు తెరపైకి రావడం, ఏ1గా కేటీఆర్ ఉండడంతో సమావేశాలు ఒక్క సారిగా వేడెక్కాయి. ఫార్ములా-ఈ రేసుపై చర్చకు బీఆర్‌ఎస్ సభ్యులు పట్టు పట్టడంతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. సభ నిర్వహణ తీరు పట్ల, పలు అంశాలపై సభలో చర్చల సందర్భంగా అసహనం వ్యక్తం చేస్తూ వచ్చిన మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ.. సభ ముగిసే సమయానికి కాంగ్రెస్ వైపు మళ్లారు. ఫార్ములా ఈ రేసుపై చర్చ కోసం బీఆర్‌ఎస్ సభ్యులు పట్టు పడుతున్న క్రమంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం సభను బీఆర్‌ఎస్ సభ్యులు అడ్డుకుంటున్న తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పూర్తిస్థాయిలో మద్దతుగా ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చారు.
హరీశ్ సవాల్.. స్వీకరించిన రేవంత్
సభలో అధికార, విపక్షాల మధ్య వాద, ప్రతివాదనలు నడుస్తున్న క్రమంలో సభలో ఓఆర్‌ఆర్ టోల్ లీజు వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని హరీశ్‌రావు సవాల్ విసిరారు. అయితే, ఆ సవాల్‌ను స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఓఆర్‌ఆర్ టోల్ లీజు వ్యవహారంపైన సిట్ విచారణకు ఆదేశించారు. మరో వైపు రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ నివేదికకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటనకూ తేడా ఉందంటూ హరీశ్‌రావు, కేటీఆర్ ఆరోపించారు. వారి కోరిక మేరకు రాష్ట్ర అప్పులపైన స్వల్పకాలిక చర్చను చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సమగ్ర వివరాలు వెల్లడించారు. ఏడు రోజుల పాటు సాగిన శాసనసభలో తెలంగాణ భూ భారతి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీలు, తెలంగాణ జీఎస్టీ, వేతనాలు-పెన్షన్ల చెల్లింపులు, జీహెచ్‌ఎంసీ, తెలంగాణ మున్సిపాలిటీలు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించి సవరణ బిల్లులపైసభలో చర్చించి.. ఆమోదించారు. మండలిలోనూ 8 బిల్లులను ఆమోదించడంతోపాటు 3 అంశాలపై స్పల్పకాలిక చర్చ జరిగింది.
ప్రజావసరాల దృష్టితో చర్చ జరిపాం: శ్రీధర్‌బాబు
ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకునే శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఏడాది కాలంగా సభలో ఒక్క సస్పెన్షన్‌కూ తావు ఇవ్వకుండా సభను నడిపామన్నారు. సభ వాయిదా అనంతరం ఏర్పాటు చేసిన మీడియాతో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పిన తాము.. అసెంబ్లీలో భూ భారతి బిల్లును పెట్టి ఆమోదింపజేశామన్నారు. స్పీకర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సభను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. సినీ పరిశ్రమ తమకు ముఖ్యమని, అయితే ఎంత పెద్ద వారైనా మానవీయ కోణం మరిచిపోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారన్నారు.