Share News

Sandeep Sandilya: మూడేళ్లలో నషా ముక్త్‌ తెలంగాణ

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:47 AM

అందరి సహకారంతో వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తామని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. త్వరలో 2 లక్షల మంది ‘యాంటీ డ్రగ్‌ సోల్జర్స్‌’ను తయారు చేస్తామని చెప్పారు.

Sandeep Sandilya: మూడేళ్లలో నషా ముక్త్‌ తెలంగాణ

  • త్వరలో 2 లక్షల మంది డ్రగ్స్‌ వ్యతిరేక సైనికులు

  • టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తామని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో (టీజీ న్యాబ్‌) డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. త్వరలో 2 లక్షల మంది ‘యాంటీ డ్రగ్‌ సోల్జర్స్‌’ను తయారు చేస్తామని చెప్పారు. ‘నషా ముక్త్‌ తెలంగాణ’ కోసం టీజీ న్యాబ్‌, పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలకు అన్ని విభాగాలు, ప్రజల సహకారం అవసరమని కోరారు. ‘యువతలో మాదకద్రవ్యాల వినియోగం, నివారణ, అవగాహన, పునరావాసం’ అంశంపై విద్యా సంస్థలు, ఐటీ కంపెనీల నిర్వాహకులకు టీజీ న్యాబ్‌ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల సిబ్బంది హాజరయ్యారు. సందీప్‌ శాండిల్య వారికి పలు అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, ఎన్‌ఎ్‌సఎస్‌, ఎన్‌సీసీ కోఆర్డినేటర్లపై ఉందని చెప్పారు. మార్కెట్‌లోకి రోజుకో కొత్తరకం డ్రగ్‌ వస్తోందని, నిటాజిన్‌ అనే డ్రగ్‌ ఒక్క గ్రామ్‌ 40 కేజీల ఓపీఎంతో సమానమైందంటే దాని తీవ్రత ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.


  • అప్పటి వరకు టాపర్‌.. ఒక్క రోజులో..

డ్రగ్స్‌ దుష్ప్రభావాల గురించి వివరిస్తూ సందీప్‌ శాండిల్య తన దృష్టికి వచ్చిన ఒక ఘటనను తెలిపారు. ‘‘ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని మొదటి మూడేళ్లు అన్ని సబ్జెక్టుల్లో టాపర్‌గా నిలిచింది. ఓ రోజు స్నేహితుడు పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించడంతో అందరితో కలిసి వెళ్లిన అమ్మాయి అక్కడ సరదాగా డ్రగ్స్‌ తీసుకుంది. బాగుండటంతో రెండో రోజు కూడా అడిగి తీసుకుంది. ఇలా మొదట కొన్ని రోజులు ఫ్రీగా ఇచ్చినా ఆ తర్వాత ఒక్కో గ్రాం రూ.7 వేలకు విక్రయించారు. మొదట తన వద్ద ఉన్న బంగారం విక్రయించిన అమ్మాయి.. ఆ తర్వాత దొంగతనం చేయడం మొదలుపెట్టింది. చివరికి డ్రగ్స్‌ కోసం వ్యభిచారం చేసే స్థాయికి దిగజారింది. కుటుంబ సభ్యుల సహకారంతో మత్తు నుంచి బయటపడింద’ని చెప్పారు.


  • 2019లోనే 5వ స్థానంలో తెలంగాణ

సామాజిక న్యాయ శాఖ 2019 నివేదిక ప్రకారం.. ఇంజక్షన్ల రూపంలో నేరుగా రక్తంలోకి డ్రగ్స్‌ తీసుకుంటున్న వారి సంఖ్యపరంగా (64 వేల మంది) దేశంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. సైకోయాక్టివ్‌ రకం డ్రగ్‌ వినియోగం విషయంలో 3వ స్థానంలో నిలిచింది. 2.4 లక్షల మంది ఈ డ్రగ్‌ బారిన పడినట్లు నివేదిక పేర్కొంది. కొకైన్‌ వాడకంలో 10వ స్థానం, గంజాయి, చరస్‌ వాడకంలో తెలంగాణ 28వ స్థానంలో ఉన్నట్లు తేలింది.

Updated Date - Nov 28 , 2024 | 03:47 AM