Share News

State Agriculture Department : సన్నాల జాబితా సిద్ధం

ABN , Publish Date - Jun 26 , 2024 | 02:38 AM

తెలంగాణలో సర్కారు బోనస్‌ అందించే సన్న రకం వరి వంగడాల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌. ఛైర్మన్‌గా.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈమేరకు కసరత్తు పూర్తిచేసింది.

State Agriculture Department : సన్నాల జాబితా సిద్ధం

  • బోనస్‌ ఇవ్వబోయే వరి విత్తనాలు ఖరారు

  • రైతులు పండించే రకాల నుంచే ఎంపిక

  • 40 పబ్లిక్‌ వెరైటీలు, మరికొన్ని ప్రైవేటువి..

  • రాష్ట్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ నిర్ణయం

  • రైతుల్లో సందిగ్ధం తొలగేలా నేడు ప్రకటన

  • బోనస్‌తో అన్నదాతకు రూ.2,800 వరకు లబ్ధి

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సర్కారు బోనస్‌ అందించే సన్న రకం వరి వంగడాల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌. ఛైర్మన్‌గా.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈమేరకు కసరత్తు పూర్తిచేసింది. ఎంపిక చేసిన విత్తన వెరైటీల జాబితాకు ఆమోద ముద్ర వేసి బుధవారం ప్రకటించే అవకాశాలున్నాయి. సన్నాల్లో 40 పబ్లిక్‌ వెరైటీలతోపాటు మరికొన్ని ప్రైవేటు వెరైటీలను కూడా జోడించి తుది జాబితా ప్రకటించనున్నారు. దీంతో రైతులకు సన్నాల సాగుపై స్పష్టత రానుంది.

పూర్తయిన కమిటీ కసరత్తు..

ఈ ఖరీఫ్‌ నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారికి మాత్రమే వర్తిస్తుంది. 2024-25 పంట కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కనీస మద్దతు ధరలను ప్రకటించింది. వరి సాధారణ రకానికి రూ.2,300, ఏ-గ్రేడుకు రూ.2,320 చొప్పున నిర్ణయించింది. దీనికి బోనస్‌ కలిపితే సన్నాలకు క్వింటా రూ.2,800 వరకు గిట్టుబాటు అవుతుంది. ఇదిలా ఉండగా సన్న రకాలు, దొడ్డు రకాల విషయంలో రైతులకు కొన్ని అనుమానాలున్నాయి. కొన్ని దొడ్డు వెరైటీలు కూడా సన్నాలుగా చలామణి అవుతున్నాయి. ఈ క్రమంలో ఏయే రకాలు సన్నాలు..? వేటికి బోనస్‌ ఇస్తారు.? అనే అంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియక ముందు నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సన్న రకాల జాబితాను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌/డైరెక్టర్‌ ఛైర్మన్‌గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆచార్య జయశంకర్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, రాష్ట్ర వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఆదర్శ రైతులతో కమిటీని వేసింది. ఆ కమిటీ కసరత్తుచేసి సన్నాల జాబితాను తయారు చేసింది.


జాబితాలో ఉన్నవి ఇవే..

కమిటీ రూపొందించిన జాబితాలో ఆర్‌ఎన్‌ఆర్‌-15048(తెలంగాణ సోనా), కేఎన్‌ఎం-1638, జేజీఎల్‌-1798, వరంగల్‌-962, జేజీఎల్‌-3844, జేజీఎల్‌-11118, కేఎన్‌ఎం-733, వరంగల్‌-1119, ఆర్‌ఎన్‌ఆర్‌-21278, జీజీఎల్‌-17004, వరంగల్‌-44, బీపీటీ-5204, జేజీఎల్‌-11470, జేజీఎల్‌-384, జేజీఎల్‌-3828, జేజీఎల్‌-3855, జేజీఎల్‌-11727, వరంగల్‌-347, వరంగల్‌-14, వరంగల్‌-32100, ఆర్‌ఎన్‌ఆర్‌-2458, కేపీఎస్‌-2874, ఆర్‌ఎన్‌ఆర్‌-2354, ఆర్‌ఎన్‌ఆర్‌-2465, వరంగల్‌-697, జేజీఎల్‌-28545, జేజీఎల్‌-27356, హెచ్‌ఎంటీ సోనా, బీపీటీ-2595, బీపీటీ-5204, ఎంటీయూ-1064, ఎంటీయూ-1121, ఎంటీయూ-1224, ఎంటీయూ-1262, ఎంటీయూ-1271, ఎంటీయూ-1282, ఎన్‌డీఎల్‌ఆర్‌-7, ఎన్‌ఎల్‌ఆర్‌-34449 తదితర ఫైన్‌ వెరైటీలు ఉన్నాయి. వీటితోపాటు కొన్ని ప్రైవేటు కంపెనీలు ‘ట్రూత్‌ ఫుల్‌ లేబుల్‌’ తో విక్రయించే వెరైటీలు కూడా నిపుణుల కమిటీ ఎంపిక చేసిన జాబితాలో ఉన్నాయి. రైతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్రైవేటు విత్తనాలను సాగు చేస్తున్నారు. వాటిలో కొన్ని ప్రాచుర్యం పొందిన వెరైటీలు ఉన్నాయి. కొన్నేమో అంతగా తెలియనివి ఉన్నాయి. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని జాబితా రెడీ చేశారు. ఇక పబ్లిక్‌ వెరైటీల జాబితాలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన విత్తనాలు వెరైటీ నంబర్లతో సహా ఉంటాయి. సన్నాల జాబితాలో 6 మి.మీ కంటే తక్కువ పొడవున్న వెరైటీలను తీసుకుంటారు. గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5 కంటే ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర మంత్రి మండలి ఆదేశాలకు అనుగుణంగా నిపుణుల కమిటీ బుధవారం సన్న వెరైటీల జాబితాను ఫైనల్‌ చేసి ప్రకటించే అవకాశాలున్నాయి.

Updated Date - Jun 26 , 2024 | 02:41 AM