Share News

Greenfield Roads: భూమికి భూమే పరిహారం

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:35 AM

ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నుంచి ఫ్యూచర్‌సిటీ, రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు వెళ్లేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Greenfield Roads: భూమికి భూమే పరిహారం

  • ప్రతిపాదిత రావిర్యాల-ఆమనగల్‌

  • గ్రీన్‌ఫీల్డ్‌ మార్గంలో రిజర్వ్‌ ఫారెస్టులు

  • 18 కి.మీ. పరిధిలో 84.15 హెక్టార్ల అటవీభూమి

  • పరిహారం కింద అటవీశాఖకు ఇతర ప్రాంతాల్లో భూమి కేటాయింపు

  • గుర్తించాలంటూ కలెక్టర్లకు సీసీఎల్‌ఏ ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నుంచి ఫ్యూచర్‌సిటీ, రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు వెళ్లేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు చేరుకునేందుకు దాదాపు 9 కొత్త రోడ్లను దశల వారీగా నిర్మించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా భూ సేకరణపై దృష్టి సారించింది. తొలిదశలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని రావిర్యాల నుంచి ఆమనగల్‌ వరకు 41.5 కి.మీ.ల మేర రోడ్డు నిర్మించనున్నారు. అందుకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 18 కి.మీ.ల పరిధిలో 6 రిజర్వ్‌ ఫారె్‌స్టలు ఉన్నాయని, రహదారి నిర్మాణానికి 84.15 హెక్టార్ల (దాదాపు 208 ఎకరాల) అటవీభూమి అవసరమవుతోందని అధికారులు గుర్తించారు. ఆ భూములు అటవీశాఖకు చెందినవి కావడంతో వాటి మీదుగా రహదారిని నిర్మించాలంటే అటవీశాఖ అనుమతి తీసుకోవడంతోపాటు, పరిహారం కింద తిరిగి భూములనే ఇవ్వాల్సి ఉంటుంది.


ఈ నేపథ్యంలో, 18 కి.మీ.ల రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే 84.15 హెక్టార్ల అటవీ భూమికి పరిహారంగా రాష్ట్రంలో మరో చోట భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారా బాద్‌ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పరిహారం కింద ఇచ్చేందుకు అనువైన భూములను ఆయా జిల్లాల పరిధిలో గుర్తించాలంటూ భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. మళ్లీ అడవిని పెంచేందుకు వీలుగా ఉండే భూములనే అటవీశాఖకు ఇవ్వాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు అంటున్నాయి. అందుకు అనుగుణంగా ఉన్న భూముల గుర్తింపుపై ఆయా జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించినట్టు సమాచారం. కాగా, ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు నిర్మించతలపెట్టిన అన్ని గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లకు సంబంధించి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించింది.

Updated Date - Nov 30 , 2024 | 03:35 AM