Share News

Caste Survey: కులగణన ప్రక్రియ ప్రారంభం

ABN , Publish Date - Nov 07 , 2024 | 03:25 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కులగణన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరించనున్నారు.

Caste Survey: కులగణన ప్రక్రియ ప్రారంభం

రాష్ట్రంలో తొలి రోజు ఇంటింటికీ సర్వే స్టిక్కర్లు అతికించిన ఎన్యుమరేటర్లు

  • రేపటి వరకు జాబితాల తయారీ, స్టిక్కర్లు అంటించే ప్రక్రియ..

  • 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కులగణన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యా ప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలను బ్లాకుల వారీగా విభజించారు. సర్వేలో మొదటిరోజైన బుధవారం ఆయా గ్రామాలు, వార్డులు, బస్తీల్లోని బ్లాకులకు ఎన్యుమరేటర్లు వెళ్లి ప్రతి ఇంటిలో ఉన్న కుటుంబాలను నమోదు చేశారు. ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేరుతో జాబితాను తయారుచేసి ఆ ఇంటికి స్టిక్కర్‌ను అతికించారు. జాబితాల తయారీ, స్టిక్కర్లు అంటించే ప్రక్రియను 8వ తేదీ వరకు నిర్వహించనుండగా.. ఈనెల 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వేను చేపట్టనున్నారు.


క్షేత్రస్థాయిలో సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఆ వివరాలను మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌, మండల, మునిసిపాలిటిల్లో నోడల్‌ అధికారిగా నియమితులైన జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌ బోర్డు ద్వారా పర్యవేక్షించనున్నారు. సర్వేలో సేకరించిన కుటుంబాల సమాచారమంతా అత్యంత గోప్యంగా ఉంచడంతోపాటు సర్వే షెడ్యూల్‌ను భద్రపరచనున్నారు. 9 నుంచి మొదలయ్యే సర్వేలో వివరాలను తెలిపేందుకు ఆయా కుటుంబ సభ్యులందరి ఆధార్‌కార్డులు, భూమి పాసుపుస్తకాలు, రేషన్‌కార్డులను ప్రజలు సిద్ధంగా ఉంచుకుంటే వివరాలను త్వరగా తెలిపే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు సూచిస్తున్నారు. సర్వే సమాచారం మొత్తం ప్రణాళికా శాఖకు చేరనుండగా ఆ సమాచారాన్ని బీసీ కమిషన్‌కు అందించనున్నారు.


సర్వే ఇలా..

  • సర్వేలో 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయి.

  • ప్రతి ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లో సుమారు 150 నుంచి 175 కుటుంబాలుంటాయి.

  • ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లను పర్యవేక్షించేందుకు ఒక సూపర్‌వైజర్‌ ఉంటారు.

  • ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయి.

  • మొత్తం 87,092 ఎన్యుమరేషన్‌ బ్లాక్‌లు గుర్తించారు. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 19,328, ఇతర ప్రాంతాల్లో 67,764 ఉన్నాయి.

  • సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా 94,750 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు.

Updated Date - Nov 07 , 2024 | 03:25 AM