జిల్లాల పర్యటనకు వర్గీకరణ కమిషన్
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:15 AM
రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ బుధవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనుంది.
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ బుధవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనుంది. తమ పర్యటనను సంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించనున్నట్టు కమిషన్ చైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డా. షమీం అక్తర్ తెలిపారు. పర్యటనలో భాగంగా తమ దృష్టికి వచ్చిన అర్జీలతో పాటు ప్రతి అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి వర్గీకరణపై ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేస్తామని ఆయన చెప్పారు.
సోమవారం కమిషన్ కార్యాలయం బీఆర్‌కే భవన్‌లో మాల, మాదిగలతో పాటు, జంగమ, చిందు, బేడ/బుడగ జంగమ, బైండ్ల, మాంగ్, అరుంధతీయ, మిత అయ్యల్వార్ సహా పలు కులాల వారు కమిషన్ చైర్మన్‌ను కలిశారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై వారి అభిప్రాయాలను కమిషన్‌కు తెలియజేశారు. తమ కులాల వెనుకుబాటుతనంతో పాటు, విద్య, ఉద్యోగాల సాధనలో రిజర్వేషన్లను అందుకోవడంలో జరుగుతున్న అన్యాయం గురించి రాతపూర్వకంగా విజ్ఞప్తులను కమిషన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా చిందు కులానికి చెందిన ప్రతినిధులు, తమ కులవృత్తి అయిన భాగోతం కళను కమిషన్ ఎదుట ప్రదర్శించారు.