Naveen Mittal: ఫార్మాసిటీ రద్దు కాలేదు..
ABN , Publish Date - Sep 22 , 2024 | 03:14 AM
గతంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ రద్దు కాలేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ.. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఇప్పటికీ అమల్లోనే 2016 నాటి ఫార్మాసిటీ జీవో31
భూసేకరణ నోటిఫికేషన్ రద్దుపై అప్పీళ్లు దాఖలు
అవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి
హైకోర్టులో రెవెన్యూ ముఖ్యకార్యదర్శి అఫిడవిట్
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గతంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ రద్దు కాలేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ.. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. గతంలో చేపట్టిన భూసేకరణ రద్దు కాలేదని.. సేకరించిన భూములను మళ్లీ పిటిషనర్ల పేరుతో రెవెన్యూ రికార్డులను సవరించడం సాధ్యం కాదని అందులో స్పష్టం చేశారు. ‘‘ఫార్మాసిటీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. భూసేకరణ కూడా రద్దయిందనే పిటిషనర్ల వాదనలో నిజం లేదు. ఆ వాదనను ప్రభుత్వం తిరస్కరించింది. వార్తాపత్రికల కథనాలను పిటిషనర్లు సమర్పించారు. అవి ఎప్పటికీ సాక్ష్యాధారాలు(ఎవిడెన్స్)గా పనికిరావు. అవి కేవలం ‘హియర్ సే ఎవిడెన్స్’లు మాత్రమేనని పలు సందర్భాల్లో కోర్టు తీర్పులున్నాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామం వద్ద హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించిన 2016 జూన్ 10న పరిశ్రమల శాఖ ఇచ్చిన జీవో 31 రద్దు కాలేదు. ఇప్పటికీ అది అమల్లోనే ఉంది. ఆ జీవోను అమలుచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పిటిషనర్లు పేర్కొంటున్నట్లుగా భూసేకరణ ప్రొసీడింగ్స్‌కు కాలంచెల్లిపోలేదు. నూతన భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూసేకరణ చేపట్టిన నేపథ్యంలో సదరు భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవిలు జరగవు. లావాదేవీలకు సంబంధించిన స్లాట్‌లు బుకింగ్‌లకు ఆస్కారం ఉండదు. గ్రీన్ ఫార్మాసిటీ కోసం ఇప్పటికే మెజారిటీ భూముల సేకరణ పూర్తయింది. ప్రస్తుత దశలో ఈ కోర్టు(సింగిల్ బెంచ్) జోక్యం చేసుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించిన గ్రీన్ ఫార్మాసిటీ ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుంది.
పిటిషనర్ల భూములను సేకరించి.. పరిహారానికి సంబంధించిన అవార్డు జారీచేశాం. పరిహారం మొత్తాలను కాంపిటెంట్ అథారిటీ వద్ద ఇప్పటికే డిపాజిట్ చేశాం. చట్టప్రకారం అవార్డు పాస్ చేసిన తర్వాత కూడా సదరు పరిహారం మొత్తాలను స్వీకరించడంలో పిటిషనర్లు విఫలమయ్యారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ గత ఏడాది సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశాం. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇప్పటికీ అమల్లోనే ఉంది. డివిజన్ బెంచ్‌లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత దశలో జోక్యం చేసుకుంటే ఇబ్బందుల తలెత్తుతాయి. ఈ పిటిషన్‌లను కొట్టివేయండి’’ అని కౌంటర్ అఫిడవిట్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు.