Share News

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పెనుగొండకు

ABN , Publish Date - Dec 19 , 2024 | 03:31 AM

ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రచించిన దీపిక అనే సాహిత్యవిమర్శా సంపుటికి ఈ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ప్రకటించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పెనుగొండకు

  • లక్ష్మీనారాయణ రచించిన ‘దీపిక’కు పురస్కారం

  • యాభై ఏళ్లకుపైగా తెలుగు సాహితీ సేద్యం

  • అరసం జాతీయ అధ్యక్షుడిగా సేవలు

  • వచ్చే ఏడాది మార్చి 8న అవార్డు ప్రదానం

గుంటూరు, న్యూఢిల్లీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు 2024 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రచించిన దీపిక అనే సాహిత్యవిమర్శా సంపుటికి ఈ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు ప్రకటించారు. దేశంలో 21 భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కారాల వివరాలను ఆయన వెల్లడించారు. అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఈ పురస్కారాలను ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు. కాగా, అవార్డు దక్కించుకున్న ‘దీపిక’ను ఆయన 2021లో రచించారు. కాగా తెలుగులో అవార్డు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులుగా ‘ఆంధ్రజ్యోతి’ మాజీ సంపాదకుడు కె.శ్రీనివాస్‌, రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, విహారి వ్యవహరించారు. పురస్కారాన్ని వచ్చే ఏడాది మార్చి 8న అందజేయనున్నారు.


సాహితి కొండ.. పెనుగొండ

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చెరువుకొమ్ముపాలెంలో 1954 అక్టోబరు 24లో లింగమ్మ, గోవిందరెడ్డి దంపుతులకు పెనుగొండ లక్ష్మీనారాయణ జన్మించారు. చెరువుకొమ్ముపాలెం, ఫిరంగిపురంలో ప్రాఽథమిక విద్యను అభ్యసించారు. ఇంటర్మీడియట్‌ వినుకొండలో, బీఏబీఎల్‌ గుంటూరు ఆంధ్ర కళాశాలలో చదివారు. 1983లో ఉప్పుటూరి గీతతో ఆయనకు వివాహం జరిగింది. 1987లో న్యాయవాదిగా ప్రస్థానం మొదలుపెట్టారు. అటుపై గుంటూరు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా 1989-90లో పనిచేశారు. బార్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడిగాను, బార్‌ అసోసియేషన్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గాను బాధ్యతలు నిర్వహించారు. తెనాలిలో 1972లో జరిగిన అరసం జిల్లా మహాసభకు ప్రతినిధిగా పులుపుల వెంకట శివయ్యతో కలిసి పెనుగొండ హాజరయ్యారు. అప్పటి నుంచి అరసంతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 2023 ఆగస్టు నుంచి అరసం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అరసం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితివేత్త ఆయనే కావడం విశేషం. వివిధ అంశాలపై 200 వ్యాసాలు, దాదాపు 50 కవిత్వ, కథా, వ్యాస సంపుటాలకు ముందుమాటలు, పదుల సంఖ్యలో పుస్తక సమీక్షలు, దాదాపు 600 సాహిత్య సభలు, సమావేశాలు, సదస్సులు.. ఇదీ పెనుగొండ లక్ష్మీనారాయణ ట్రాక్‌ రికార్డు. 1974లో రచించిన సమిధ కవితతో పెనుగొండ సాహితీ ప్రస్థానం మొదలైంది. అటుపై రేపటిలోకి, అనేక, నూరేళ్ల పులుపుల, విధిత, దీపికతోపాటు అనేక పుస్తక సమీక్షలు, డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, వల్లూరి శివప్రసాద్‌లతో కలిసి సహ సంపాదకత్వం, గౌరవ సంపాదకత్వం వహించారు. ఉగాది కవి సమ్మేళనాలకు ప్రత్యామ్నాయంగా మేడే నాడు కవితా గోష్ఠులను గుంటూరులో ‘అవగాహన’తో కలిసి నిర్వహిస్తున్నారు.


కా.రా.ను కదిలించిన పరిశోధన

కేంద్ర సాహిత్వ అకాడమీ 1997లో హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో ‘తెలుగులో కఽథా సంకలనాలు-స్థూల పరిశీలన’ అనే అంశంపై పెనుగొండ పరిశోధన పత్రం సమర్పించారు. ఈ పరిశోధన ప్రముఖ కఽథా రచయిత కాళీపట్నం రామారావును కదిలించింది. దాని ఆధారంగానే శ్రీకాకుళం జిల్లాలో కఽథా నిలయాన్ని ఏర్పాటు చేశారు.


గర్వంగా భావిస్తున్నాను....

సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికవ్వడం సంతోషంగా ఉందని పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన రచనల్లో ‘దీపిక’ ప్రత్యేకమైంది. సాహిత్య అకాడమీ అవార్డు వరించడాన్ని గర్వంగా భావిస్తున్నా. సాహితీ ప్రపంచంలో అరసం నాకు ఒక స్థానం కల్పించింది. ఇకపైనా అరసం వారసత్వాన్ని కొనసాగిస్తాను’’అని పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 03:31 AM