Share News

వీధి కుక్కల బెడదపై ఓ విధానం లేదా?:హైకోర్టు

ABN , Publish Date - Jul 03 , 2024 | 06:06 AM

వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు చనిపోతున్న ఘటనలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా పభుత్వానికి ఓ విధానం అంటూ లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది.

వీధి కుక్కల బెడదపై ఓ విధానం లేదా?:హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు చనిపోతున్న ఘటనలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా పభుత్వానికి ఓ విధానం అంటూ లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటామంటే కుదరదని, ఇలాంటివి భవిష్యత్తులో చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

గతేడాది ఫిబ్రవరి 19న అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌, తాజాగా జూన్‌ 28న పటాన్‌చెరులో బీహార్‌ వలసకూలీల కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలుడు విశాల్‌ కుక్కల దాడిలో చనిపోయిన ఘటనలపై వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌లపై మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి ‘అనుపమ్‌ త్రిపాఠీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను ఎంతవరకు అమలు చేస్తున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖ, ఇతరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదాపడింది.

Updated Date - Jul 03 , 2024 | 06:34 AM