Share News

Kaleshwaram project: బుంగలు పూడ్చి.. ఆధారాలు లేకుండా చేశారు!

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:32 AM

‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులను తెలుసుకోవడానికి నిర్వహించాల్సిన పరీక్షలకు తెలంగాణ నీటిపారుదల శాఖ పట్టించుకోలేదు.

Kaleshwaram project: బుంగలు పూడ్చి.. ఆధారాలు లేకుండా చేశారు!

  • అంతకుముందు జరపాల్సిన పరీక్షలను పట్టించుకోలేదు

  • రాష్ట్ర నీటిపారుదలశాఖపై ‘జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ’ ఆక్షేపణ.. లేఖ

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులను తెలుసుకోవడానికి నిర్వహించాల్సిన పరీక్షలకు తెలంగాణ నీటిపారుదల శాఖ పట్టించుకోలేదు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించింది’ అని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) మండిపడింది. ఈ మేరకు ఎన్‌డీఎ్‌సఏ డైరెక్టర్‌ (టెక్నికల్‌) గత నెల 11న నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. బ్యారేజీలు దెబ్బతినడానికి, వైఫల్యం చెందడానికి దారితీసిన కారణాలను విశ్లేషించడానికి అవకాశం లేకుండా కీలక సమాచారం, ఆధారాలు ధ్వంసమయ్యాయని ఈ లేఖలో ఆక్షేపించింది. ‘మేడిగడ్డ బ్యారేజీ ప్లింత్‌ శ్లాబుకి ఎగువన, దిగువన గ్రౌటింగ్‌ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చివేయడంతో సీకెంట్‌ పైల్స్‌, పారామెట్రిక్‌ జాయింట్స్‌ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, గ్రౌటింగ్‌తో స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకొని ఆ అవకాశం లేకుండా పోయింది’ అని పేర్కొంది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు గతేడాది అక్టోబరు 23వ తేదీన కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనానికి ఏర్పాటైన ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బ్యారేజీల్లో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియోఫిజికల్‌, జియోటెక్నికల్‌ పరీక్షలు ఇందులో ఉన్నాయి.


ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందని ఎన్‌డీఎ్‌సఏ తాజాగా తప్పుబట్టింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ప్రస్తావిస్తూ.. వాటి పునాదుల కింద ఏర్పాటు చేసిన సీకెంట్‌పైల్స్‌ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కర్టెయిన్‌ గ్రౌటింగ్‌ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారని పేర్కొంది. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే.. బ్యారేజీలు దెబ్బతినడానికి, వైఫల్యానికి గల కారణాలు కూడా తెలియవని స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ చర్యలతో ఎన్డీఎ్‌సఏ నిపుణుల కమిటీ పని ప్రణాళికకు సైతం విఘాతం కలిగిందని ఆక్షేపించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యం, లోపాలపై డిసెంబరు నెలాఖరుకల్లా నివేదిక అందిస్తామని ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ గతంలో చెప్పింది. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నివేదిక అందే అవకాశాలున్నాయి. మరోవైపు, మేడిగడ్డకు ఎగువన మట్టి కట్ట లేదా రబ్బర్‌ డ్యామ్‌ కట్టి రానున్న రబీ సీజన్‌కు నీటిని అందించాలనే ప్రయత్నాలకు కూడా తాజా పరిణామాలతో బ్రేక్‌ పడింది.

Updated Date - Nov 28 , 2024 | 04:32 AM