Share News

Ganesh. గణేశ్‌ నిర్వహణ ఖర్చు రూ.300కోట్లు

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:15 AM

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలంటే భక్తి శ్రద్ధలతో తొమ్మిదిరోజుల పాటు వినాయకుడిని పూజించడ మే కాదు, తమ కమిటీ గొప్పతనాన్ని, సత్తాను చాటే ప్రదర్శనగా మారింది. ఐక్యత కోసం, భక్తిప్రపత్తులు పెరగడం కోసం నిర్వహించే ఈ ఉత్సవాలు ప్రస్తు తం ఆర్భాటాన్ని, హంగామాను చాటుకునే వేదికగా మారుతున్నాయి.

Ganesh. గణేశ్‌ నిర్వహణ ఖర్చు రూ.300కోట్లు

నవరాత్రుల నిర్వహణకు భారీ ఖర్చుకు వెరవని ఉత్సవ కమిటీలు

మారుమూల తండా మొదలు అంతటా మండపాలు

విగ్రహ ప్రతిష్ఠ, శోభాయాత్ర వరకు దండిగా ఖర్చు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10వేల మండపాలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలంటే భక్తి శ్రద్ధలతో తొమ్మిదిరోజుల పాటు వినాయకుడిని పూజించడ మే కాదు, తమ కమిటీ గొప్పతనాన్ని, సత్తాను చాటే ప్రదర్శనగా మారింది. ఐక్యత కోసం, భక్తిప్రపత్తులు పెరగడం కోసం నిర్వహించే ఈ ఉత్సవాలు ప్రస్తు తం ఆర్భాటాన్ని, హంగామాను చాటుకునే వేదికగా మారుతున్నాయి. గణేశ్‌ విగ్రహాలు మొదలు మండపాల అలంకరణ, డీజేలు, బ్యాండ్‌ మేళాలు, అన్నదానాలు, ప్రత్యేక వస్త్రాలంకరణ, శోభాయాత్రలో ప్రత్యేకత చాటేందుకు పోటీ పెరగడంతో ఉత్సమ కమిటీల ఖర్చు అదే స్థాయిలో భారీగా పెరిగింది.

ఉమ్మడి జిల్లా అంతటా పట్టణాల్లో ప్రతీ గల్లీలో, గ్రామాల్లో వాడవాడలా గణేశ్‌ ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. మారుమూల గిరిజనతండాల్లో పది ఇళ్లు ఉన్నచోట కూడా గణేశ్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదివేల పైచిలుకు విగ్రహాలు ప్రతిష్ఠించినట్టు అధికారులు చెబుతున్నారు. నవరాత్రుల సందర్భంగా ఉత్సవ కమిటీలు రూ.300 కోట్ల పైచిలు కు వ్యయం చేస్తున్నట్టు అంచనా. విగ్రహాలు మొదలు మం డపాల అలంకరణ, నిత్యపూజలు, నిత్య అన్నదానాలు, టెం ట్లు, కుర్చీలు, బ్యాండ్‌మేళాలు, శోభాయాత్రరోజున ప్రత్యేక అలంకరణలు ఇలా అడుగడుగునా భారీగా ఖర్చు చేస్తుండడంతో ఒక్కో మండపం వద్ద కనీసం రూ.50వేల నుంచి గరిష్ఠంగా రూ.5లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. భక్తులే చందా ల రూపంలో వీటిని సమకూర్చుకుంటుంటే, కొన్ని చోట్ల వ్యా పారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు విగ్రహాలను అందజేయడం, అన్నదానాలు చేయించడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. మొత్తంగా ప్రతీ భక్తుడు గణేశ్‌ ఉత్సవాల్లో ఏదో రకంగా ఎంతో కొంత భాగస్వామ్యం కలిగి ఉండడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.

ఉమ్మడి జిల్లాలో 10వేల పైచిలుకు మండపాలు

నల్లగొండ జిల్లాలో 4,302 వరకు గణేశ్‌ ప్రతిమలను ప్రతి ష్ఠించగా, నల్లగొండ పట్టణంలో పెద్ద, చిన్న కలిపి సుమారు 800వరకు ఏర్పాటుచేశారు.మిర్యాలగూడ పట్టణంలో 300 వరకు, దేవరకొండలో 76, సూర్యాపేటలో 450, భువనగిరి లో 500 పైచిలుకు విగ్రహాలు ప్రతిష్ఠించారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 2,650 మండపాల్లో లంబోదరుడు పూజలందుకుంటుంటే, యాదాద్రి జిల్లాలో 3,067 మండపాల్లో గణేశ్‌ నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి.మొత్తంగా ఉమ్మ డిజిల్లాలో వాడవాడలా గణేశ్‌ మండపాలు ఏర్పాటయ్యాయి.

సర్వాంగ సుందరంగా మండపాల అలంకరణ

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో మం డపాల అలంకరణే ప్రత్యేకంగా ని లుస్తోంది. ఎక్కువ కాంతినిచ్చే మె ర్క్యూరీ లైట్లు, రంగురంగుల సీరియల్‌ బల్బులు, డెకరేషన్‌ ఫ్లవర్స్‌ తో మండపాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. టెం ట్లు మొదలు అలంకరణలో వాడే ప్రతి వస్తువూ అందంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. మైక్‌లు, సౌండ్‌సిస్టమ్స్‌ కూడా ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఏర్పాటు చేయడంతో ఖర్చు భారీగా పెరుగుతోం ది. మండపాల అలంకరణకు కనీ సం రూ.10వేలనుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్న పరిస్థితి ఉంది.

అందరికీ అందుబాటులో ప్రతిమలు

గణేశ్‌ ఉత్సవాల్లో ప్రతిష్ఠించే వినాయకవిగ్రహాలు ఉత్సవ సమితి గొప్పదనాన్ని చాటేలా ఘనంగా ఏర్పాటు చేసేందుకు డబ్బుకు వెరవకుండా ఖర్చుపెడుతున్నారు. విభిన్న రూపా ల్లో, భిన్నమైన రీతిలో ఆకర్షణీయంగా ఉండే గణేశ్‌ ప్రతిమలను కమిటీ ప్రతిష్ఠకు వినియోగిస్తున్నారు. పీవోపీ, రంగులతో తయారయ్యే ఈ విగ్రహాలను తక్కువలో తక్కువగా రూ.5వేల నుంచి గరిష్ఠంగా రూ.1లక్ష వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అత్యధికంగా రూ.20వేల నుంచి రూ.35వేల మధ్య ధర ఉన్న విగ్రహాలే ఎక్కువగా ప్రతిష్ఠించారు.

రోజువారీ అలంకరణలూ ప్రత్యేకమే

నవరాత్రోత్సవాల సందర్భంగా గణేశునికి పూజలు నిర్వహించే క్రమంలో రోజువారీ అలంకరణలకు భక్తులు వెరవకుండా ఖర్చు చేస్తున్నారు. పూలదండలు, స్వామివారికి వస్త్రాలంకరణ, ప్రసాదాలు, నైవేద్యాలకు ఆ రోజు పూజలో పీటలమీద కూర్చునే దంపతులు వెచ్చిస్తున్నారు. ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అందుకోసం ఒక్కో జంట కనీసం రూ.3వేల నుంచి రూ.15వేలవరకు ఖర్చు చేస్తున్నాయి.

ప్రతిష్ఠాపన, నిమజ్జన పూజలు

విగ్రహ ప్రతిష్ఠాపన, నిమజ్జనం రోజున ప్రత్యేక పూజలతో పాటు, సేవలు చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో పాటు అతిథులను, ఉత్సవకమిటీ సభ్యులను ప్రత్యేకవస్త్రాలతో సత్కారాలు, సన్మానాలు చేస్తుండడంతో ఈ రెండు రోజుల్లో ఒక్కో మండపం వద్ద కనీసం రూ.5వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు వస్తోంది.

టెంట్లు, కుర్చీలకు డిమాండ్‌

గణేశ్‌ నవరాత్రోత్సవాల సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసే స్టేజీతో పాటు మండపాల వద్ద కుర్చీలు, టెంట్లు, వాట ర్‌ డ్రమ్ములు, వాటర్‌క్యాన్లు ఏర్పాటు చేశారు. తొమ్మిదిరోజుల పాటు భక్తులకు సదుపాయాలు కల్పించే నిమిత్తం ఏర్పాటు చేసే వీటికి ఒక్కో మండపం వద్ద కనీసం రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చవుతోంది.

డీజే మోగిందంటే కరెన్సీ రాలాల్సిందే

విగ్రహ ప్రతిష్ఠాపన రోజు, శోభాయాత్ర రోజు డీజేలతో అదరగొడితే, మిగిలిన రోజుల్లో లేటెస్ట్‌ మైక్‌ సెట్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సౌండ్‌ సిస్టమ్‌కు ఒక్కో మండపం వద్ద కనీసం రూ.10వేల నుంచి రూ.30వేలవరకు ఖర్చు వస్తోంది. డీజేలు ఏర్పాటు చేసిన చోట్ల ఈ ఖర్చు రూ.50వేలు దాటుతోంది.

పూజారులకు సంతోషకరమైన సంభావనలే

ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠాపన మొదలు నిమజ్జనం వరకు పూజారులు రోజూ ఉదయం, సాయంత్రం మండపా ల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భం గా వారికి ఉత్సవ సమితి స్థోమతను బట్టి రూ.2వేల నుం చి రూ.15వేల వరకు సంభావన చెల్లిస్తున్నారు. భక్తుల ఇష్టం మేరకు ఇతర సంభావనలు కూడా ఉంటాయి.

మద్యం విక్రయాల్లోనూ దడదడే

నవరాత్రులలో ముఖ్యంగా శోభాయాత్ర రోజు మద్యం విక్రయాలకూ గిరాకీ ఎక్కువగానే ఉంటోంది. ఆ రోజున శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు సరదాగా మద్యం తీసుకొని స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ గణేశ్‌ నిమజ్జనం చేస్తారు. వాస్తవానికి ఆ రోజున మద్యం విక్రయాలు ఉండకపోయినా, అంతకుమునుపే మద్యం కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటున్నారు.

శోభాయాత్రకు దండిగా ఖర్చు

గణేశ్‌ నవరాత్రోత్సవాల అనంతరం నిమజ్జనానికి తరలేరోజు ఆయా కాలనీలు, పట్టణాలు, గ్రామాల్లో ఉత్సవ స మితుల ఆధ్వర్యంలో గ్రాండ్‌గా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. డీజేలతో పాటు, బ్యాండ్‌మేళాలు, ప్రత్యేక డ్ర స్సులతో ఆట, పాటలతో కమిటీ సభ్యులు, కుటుంబాలతో సహా శోభాయాత్రలో పాల్గొని సందడి చేస్తున్నారు. లారీ లు, మినీలారీలు, ట్రాక్టర్లు, ఆటోల్లో గణేశులను తీసుకెళ్తూ డ్యాన్స్‌లు,బ్యాండ్‌ మేళాలతో పాటు, రంగులు చల్లుకుం టూ సందడి చేస్తారు. ఈ శోభాయాత్రలకు ఒక్కో కమిటీ కి కనీసం రూ.10వేలనుంచి రూ.1లక్షవరకు ఖర్చవుతోంది.

అన్నదానానికి వెరవని భక్తులు

గణేశ్‌ మండపాల వద్ద భక్తులు అన్నదానాలు చేస్తుంటారు. భక్తులు స్వచ్ఛందంగా ప్రతి రోజూ అన్నదానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. చిన్న మండపాల వద్ద అన్నదానానికి రోజుకు రూ.10వేల వరకు ఖర్చయితే పెద్దమండపాల వద్ద స్థోమతను బట్టి రూ.20వేల నుంచి రూ.1లక్షవరకు కూడా భక్తులు వెచ్చిస్తున్న పరిస్థితి ఉంది.

Updated Date - Sep 10 , 2024 | 12:15 AM