Share News

Telangana : గ్రౌటింగ్‌ మరింత ఆలస్యం!

ABN , Publish Date - May 29 , 2024 | 05:35 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాక్‌-7 కింద అగాధాన్ని పూడ్చేందుకు గ్రౌటింగ్‌ పనుల ప్రారంభానికి మరోరోజు సమయం పట్టనుంది.

Telangana : గ్రౌటింగ్‌ మరింత ఆలస్యం!

  • డ్రిల్లింగ్‌ పూర్తయ్యాకే పనుల ప్రారంభానికి అవకాశం

  • మేడిగడ్డలో కొనసాగుతున్న గేట్ల తొలగింపు, షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు

మహదేవపూర్‌ రూరల్‌, మే 28: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న బ్లాక్‌-7 కింద అగాధాన్ని పూడ్చేందుకు గ్రౌటింగ్‌ పనుల ప్రారంభానికి మరోరోజు సమయం పట్టనుంది. బ్లాక్‌-7 లో మొత్తం 11 గేట్లు ఉండగా.. అందులో 4 నుంచి 5 గేట్ల ముందున్న బేలో ఇసుక గ్రౌటింగ్‌ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం బోర్‌వెల్స్‌తో హోల్స్‌ వేసే పనులు కొనసాగుతున్నాయి. ఒక్కో హోల్‌ వేసేందుకు 10 నుంచి 12 గంటల సమయం పడుతున్నట్లు, దీంతో గ్రౌటింగ్‌ పనుల ప్రారంభం ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

బ్లాక్‌-7లో ఏర్పడిన అగాధం సుమారు 4నుంచి 5 గేట్ల బే పరిధిలో ఉన్నట్లు భావిస్తున్న అధికారులు.. ప్రతి బేలోనూ రెండేసి హోల్స్‌ వేస్తున్నారు. అయితే మంగళవారం నాటికి రెండు బేలలో మాత్రమే హోల్స్‌ వేసే పనులు పూర్తయ్యాయి. మిగతా రెండు లేదా మూడు బేలలో హోల్స్‌ పూర్తయితేనే ఇసుక గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ప్రస్తుతం.. తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా చేపట్టిన షీట్‌ఫైల్స్‌ ఏర్పాటు, గేట్ల తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. షీట్‌ఫైల్స్‌ అమరికకు సంబంధించి బ్లాక్‌-7 దిగువన ఉన్న ప్లాట్‌ఫామ్‌ కింద ఓ వరుస సీసీ బ్లాక్‌లను తొలగించిన అధికారులు షీట్‌ఫైల్స్‌ అమరుస్తూ మళ్లీ సీసీ బ్లాకులను పునరుద్ధరిస్తున్నారు.

కాగా, మేడిగడ్డ బ్యారేజీ స్థితిగతులను గుర్తించేందుకు చేపట్టే భూ భౌతిక (జియో ఫిజికల్‌), భూ సాంకేతిక (జియో టెక్నికల్‌) పరీక్షల నిమిత్తం వచ్చే నిపుణుల కమిటీ పర్యటనపై అస్పష్టత నెలకొంది. సోమవారమే కమిటీ పర్యటనకు వస్తుందని భావించినా బుధవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. అయితే, బుధవారం పర్యటనపైనా స్పష్టత లేదు.

Updated Date - May 29 , 2024 | 05:35 AM