Share News

రెచ్చిపోతున్న వడ్డీ మాఫియా.. తెరవెనుక ప్రభుత్వ ఉద్యోగులు..

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:51 PM

‘సిద్దిపేటకు చెందిన శ్రీనివా్‌సకు అత్యవసరంగా లక్ష రూపాయలు కావాల్సి వచ్చింది. ఒక మిత్రుడి సలహాతో ఫైనాన్స్‌ నిర్వాహకుడిని కలిశాడు. ఇద్దరి పూచీకత్తు సంతకాలు, బ్లాంక్‌ చెక్కులు సమర్పిస్తే రూ.లక్ష ఇస్తానని అంగీకరించాడు. వడ్డీ మాత్రం 5 శాతం అని కండీషన్‌ పెట్టాడు. నెలకు సంబంధించిన వడ్డీ రూ.5వేలతోపాటు పేపర్‌ ఛార్జీలు రూ.వెయ్యి ముందే కట్‌ చేసుకుని రూ.94వేలు ఇచ్చాడు.’

రెచ్చిపోతున్న వడ్డీ మాఫియా.. తెరవెనుక ప్రభుత్వ ఉద్యోగులు..

ప్రభుత్వ ఉద్యోగులే పెట్టుబడిదారులు!

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు

ఇప్పటికే 40 అనుమతి లేని ఫైనాన్స్‌లపై కేసులు

రూ.1.21 కోట్లు, భారీగా బంగారం, వెండి స్వాధీనం

భూములు, ఇళ్ల రిజిస్ర్టేషన్లతో అప్పులు

3 నుంచి 7 శాతం దాకా వడ్డీ వసూలు

అప్రమత్తమవుతున్న అక్రమ ఫైనాన్స్‌ల నిర్వాహకులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 15: ‘సిద్దిపేటకు చెందిన శ్రీనివా్‌సకు అత్యవసరంగా లక్ష రూపాయలు కావాల్సి వచ్చింది. ఒక మిత్రుడి సలహాతో ఫైనాన్స్‌ నిర్వాహకుడిని కలిశాడు. ఇద్దరి పూచీకత్తు సంతకాలు, బ్లాంక్‌ చెక్కులు సమర్పిస్తే రూ.లక్ష ఇస్తానని అంగీకరించాడు. వడ్డీ మాత్రం 5 శాతం అని కండీషన్‌ పెట్టాడు. నెలకు సంబంధించిన వడ్డీ రూ.5వేలతోపాటు పేపర్‌ ఛార్జీలు రూ.వెయ్యి ముందే కట్‌ చేసుకుని రూ.94వేలు ఇచ్చాడు.’


‘హుస్నాబాద్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తికి తన కూతురి పెళ్లి కోసం రూ.10లక్షల అవసరం ఉండగా రూ.25 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని ఓ ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుడి పేరిట రిజిస్ర్టేషన్‌ చేశాడు. రూ.10లక్షలకు 3శాతం చొప్పున ప్రతీనెలా వడ్డీ ఇవ్వాలని, లేకుంటే స్థలం తనకే చెందుతుందని సదరు నిర్వాహకుడు నిబంధన పెట్టాడు. విలువైన స్థలాన్ని తక్కువ ధరకు విక్రయించడం కంటే తనఖా కింద రిజిస్ర్టేషన్‌ చేసి నెమ్మదిగా అప్పు తీర్చవచ్చని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. ప్రతీనెల రూ.30వేల వడ్డీ చెల్లించడానికి ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.’


జిల్లాలో అక్రమంగా నడుస్తున్న వడ్డీ వ్యాపార దందాలకు పై సంఘటనలు అద్దం పడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో నగదుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఫైనాన్స్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డబ్బు అవసరం ఉన్నవారి నడ్డి విరిచేలా వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తున్నారు. తాజాగా ఏకకాలంలో జిల్లావ్యాప్తంగా చేసిన దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం.


తెరవెనుక ప్రభుత్వ ఉద్యోగులు..

కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నెలవారీ చిట్టీలను నిర్వహించడం బహిరంగ రహస్యమే. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ పేరుగాంచారు. ఇంకొందరు ఉద్యోగులైతే తమ ప్రభుత్వ కొలువులను సైతం పక్కనబెట్టి రియల్‌ దందాతోపాటు ఫైనాన్స్‌ వ్యాపారాల్లోనూ మునిగి తేలుతున్నారు. రూ.లక్షల్లో వేతనాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగి అనే నమ్మకాన్ని ప్రజల్లో రంగరించడమే వీరికి ప్రధాన పెట్టుబడి. అందుకే ఇతర వ్యాపారస్తుల కంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చిన ఆఫర్లకే క్రయవిక్రయదారులు మొగ్గు చూపిస్తుంటారు. భూదందాలకు అన్ని సమయాల్లోనూ నగదు అందుబాటులో ఉండాలి. అందుకే ఫైనాన్స్‌ సంస్థల్లోనూ స్లీపింగ్‌ పార్ట్‌నర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇందులో ఉపాధ్యాయులే ఎక్కువ మంది ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. గతంలోనూ ఉపాధ్యాయుల దందాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే బహిరంగంగా ఇతర వ్యక్తులు ఉండగా, తెరవెనుక మాత్రం ప్రభుత్వ ఉద్యోగులే క్రియాశీలకంగా ఉంటూ ఫైనాన్స్‌ సంస్థలకు దిశానిర్ధేశం చేస్తున్నట్లుగా తేటతెల్లమవుతున్నది. కొందరి పేర్లపై విచారణ కూడా చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.


రాత్రికిరాత్రే అప్రమత్తం

గత శనివారం జిల్లా వ్యాప్తంగా అక్రమ ఫైనాన్స్‌లపై పోలీసులు మెరుపు దాడికి దిగారు. ఆదివారం కూడా తమకున్న సమాచారం ప్రకారం మరికొన్ని చోట్లకు వెళ్లారు. అయితే శనివారం రాత్రికిరాత్రే చాలామంది నిర్వాహకులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. తమ రికార్డులు, పెట్టుబడిదారుల వివరాలను పోలీసుల కంటబడకుండా దారి మళ్లించినట్లుగా తెలిసింది. సిద్దిపేటలోనే సుమారు 100కు పైగా అక్రమ ఫైనాన్స్‌ కేంద్రాలు ఉన్నట్లుగా సమాచారం. జిల్లా మొత్తంగా 40 కేంద్రాల్లో ఈ దాడులు జరిగాయి. రూ.1.21 కోట్లకు పైగా అక్రమంగా ఉన్న నగదుతోపాటు 13 కిలోల వెండి, 70తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 500 డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. ఇక మరుసటి రోజు పక్కా సమాచారంతో తనిఖీలు చేసినప్పటికీ ఖాళీ కుర్చీలు, ఖాళీ బీరువాలు మినహా డాక్యుమెంట్లు కూడా లభించలేదు. అయితే పకడ్బందీగా 24 బృందాలతో పోలీసుశాఖ ఈ దాడులకు పాల్పడిన విషయం బయటకు పొక్కడంతో మిగితావారంతా సర్దుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లలో 7 నుంచి 10 శాతం కూడా వడ్డీ వసూలు చేసిన దాఖలాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. పెద్ద సంఖ్యలో ప్రామిసరీ నోట్లు, బాండ్‌ పేపర్లు, బ్లాంక్‌ చెక్కులు, తెల్ల కాగితాలపై సంతకాలు, ఆస్థిపత్రాలన్నీ ప్రస్తుతం పోలీసుల చేతికి చిక్కాయి.


ఫిర్యాదులు చేయండి

ఫైనాన్స్‌ కేంద్రాల ద్వారా మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయాలని పోలీసు యంత్రాంగం సూచించింది. అంతేకాకుండా ఎవరైనా అక్రమంగా వడ్డీ వ్యాపారాలు నిర్వహించినా కూడా వారి గురించి సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. మనీ లెండింగ్‌ లైసెన్సులు లేకుండానే వడ్డీ దందాలు చేయడం అక్రమమని పోలీస్‌ కమిషనర్‌ అనురాధ పలుమార్లు హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చినా కొద్దీ చర్యలకు ఉపక్రమిస్తామని ఆమె చెప్పకనే చెబుతున్నారు. అక్రమ ఫైనాన్స్‌ కేంద్రాల గురించి సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పిస్తున్నారు. డయల్‌ 100 నంబరుతో పాటు సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూం నంబరు 8712667100కు కాల్‌ చేయాలని సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

MLC Kavitha: కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే పైచేయి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 10:56 AM