Adilabad: మహిళపై చిరుత దాడి
ABN , Publish Date - Dec 15 , 2024 | 03:30 AM
బహిర్భూమి కోసం గ్రామ శివార్లోకి వెళ్లిన మహిళపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా డేడ్రా గ్రామంలో ఘటన
తలకు గాయం.. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స
బజార్‌హత్నూర్, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): బహిర్భూమి కోసం గ్రామ శివార్లోకి వెళ్లిన మహిళపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో జరిగింది. బాధితురాలు అదే గ్రామానికి చెందిన అరక భూంబాయి. ఆమె వ్యవసాయ కూలీ. శనివారం ఉదయం గ్రామ శివారులోకి వెళ్లగా ౖ ఒక్కసారిగా చిరుత మీద పడింది. ఆమెకు తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. భూంబాయి గట్టిగా కేకలు వేయడంతో చిరుత సమీపంలోని అడవుల్లోకి వెళ్లిపోయింది. మహిళ అరుపులు విని వెంటనే అక్కడికి చేరుకున్న డెడ్రా గ్రామస్థులు.. బాధితురాలిని బజార్‌హత్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మహిళపై చిరుత దాడి విషయం తెలుసుకున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డెడ్రా గ్రామస్థుతో పాటు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. కాగా, మహిళపై చిరుత పులి దాడి చేసి గాయపర్చిన ఘటనపై మంత్రి కొండా సురేఖ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చిరుత దాడి నేపథ్యంలో డెడ్రా గ్రామ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. చిరుత కదలికిపై నిరంతరం నిఘా పెంట్టాలని, అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీపీపీఎఫ్ డోబ్రియాల్‌కు సూచించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.