Share News

Kaleshwaram Project: కాళేశ్వరం ‘ఓ అండ్‌ ఎం’ దైవాధీనం!

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:29 AM

కాళేశ్వరం ప్రాజెక్టు ‘ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం)’ బిల్లుల వ్యవహారం డైలమాలో పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, రుణాలు సమీకరించడానికి ప్రభుత్వం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Kaleshwaram Project: కాళేశ్వరం ‘ఓ అండ్‌ ఎం’ దైవాధీనం!

  • ఆ ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఖాతాలో నిధులు నిల్‌ బిల్లుల కోసం వర్క్స్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌ లేఖలు

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ‘ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓ అండ్‌ ఎం)’ బిల్లుల వ్యవహారం డైలమాలో పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి, రుణాలు సమీకరించడానికి ప్రభుత్వం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు పూర్తయితే దాని ద్వారా వచ్చే ఆదాయంతో తిరిగి చెల్లిస్తామన్న పూచీతో రుణాలు సమీకరించారు. అయితే ప్రాజెక్టు హెడ్‌వర్క్‌ ఒకటే పూర్తయింది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టగా వాటి నుంచి రెండేళ్లుగా పంపింగ్‌ జరగడం లేదు. 2022 జూలై వరదలకు కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్‌ రక్షణ గోడ కూలి అదనపు టీఎంసీ కోసం తెచ్చిన పంపులు దెబ్బతిన్నాయి. సిరిపురం(అన్నారం) పంప్‌హౌ్‌సను వరద ముంచెత్తడంతో మోటార్లన్నీ నీట మునగడమే కాక కీలకమైన ప్యానల్‌ బోర్డు కూడా దెబ్బతింది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు బయటపడ్డాయి.


ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మాత్రమే ఆదాయం వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఖాతాలో నిధులు లేకపోవడంతో ఓ అండ్‌ ఎం బిల్లుల కోసం అధికారులు ప్రభుత్వంవైపు చూస్తున్నారు. బిల్లులు చెల్లించాలని వర్క్స్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌కు ఈ నెల 13, 16, 21న లేఖలు రాశారు. ఈ బిల్లులను గతంలో కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి చెల్లించడంతో ఇప్పుడు బడ్జెట్‌ నుంచి చెల్లించాలా, వద్దా అనేది నివృత్తి చేయాలని వర్క్స్‌ అకౌంట్స్‌ డైరెక్టర్‌ వీ ఫణిభూషణ్‌ శర్మ ఈఎన్‌సీ (జనరల్‌)కు లేఖ రాశారు. ప్రధానంగా పంప్‌హౌ్‌సల నిర్వహణ, ప్రాజెక్టుల్లో నిరంతర పనులను ఓ అండ్‌ ఎం కింద చేరుస్తారు. ప్రస్తుతం ఆ బిల్లులు కూడా విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది.

Updated Date - Dec 29 , 2024 | 04:29 AM