K Kavitha: మహిళల భద్రతను గాలికి వదిలిన రేవంత్
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:34 AM
తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు
తెలంగాణ పాలిట శనిలా కాంగ్రెస్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజం
సుభా్‌షనగర్ (నిజామాబాద్), డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో చేయకుండా రేవంత్‌రెడ్డి రైతులను మోసగించారని, ప్రస్తుతం రైతుభరోసాకు అనేక షరతులు విధించే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ రేవంత్‌రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులను గ్రామ గ్రామాన నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న విషయం డీజీపీ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మహిళ భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం విడుదల చేసిందన్నారు. పనులు సాగించని కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను నరకయాతన పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో రీసర్వే చేసే ముందు భూముల వివరాలు తెలియజేస్తూ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.