Share News

కొత్త పింఛన్లెప్పుడు?

ABN , Publish Date - Feb 20 , 2024 | 03:47 PM

హైదరాబాద్‌ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులకు ఎదురు చూపులు తప్పడంలేదు.

కొత్త పింఛన్లెప్పుడు?

  • దరఖాస్తు చేసి దాదాపు రెండేళ్లు

  • 57 ఏళ్ల అర్హతతో 48 వేలమంది దరఖాస్తు

  • అంతకుముందే 800 అప్లికేషన్లు పెండింగ్‌

  • ‘ఆసరా’ సాయాన్ని విస్మరించిన గత సర్కార్‌

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం రాకతో కొత్త పింఛన్లపై ఆశ

  • ఆరు గ్యారెంటీల్లో ‘చేయూత’ ప్రధానమైనది

  • రూ.2,016 నుంచి రూ.4వేలు ఇస్తామని హామీ

  • విధివిధానాలపై ముమ్మరంగా కసరత్తు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులకు ఎదురు చూపులు తప్పడంలేదు. సాయం కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉండి సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేత, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ రోగులను ఆదుకునేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2014వరకు రూ.200 ఉన్న వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ.1000కు, వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500కు పెంచింది. కాగా, 2018లో రెండోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ.2016కు, వికలాంగుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన పింఛన్లను అందిస్తూ వచ్చారు.

జిల్లాలో ప్రస్తుతం 2,73,890 లక్షల మందికి పింఛన్‌

జిల్లాలోని 16 రెవెన్యూ మండలాల పరిధిలో వివిధ కేటగిరీల్లో ప్రస్తుతం 2,73,890 లక్షల మంది ప్రతినెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దాదాపు 20 లక్షల వరకు పింఛన్లు తీసుకుంటుండగా ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో లక్షలమంది లబ్ధి పొందుతున్నారు. అయితే పాత వారితోపాటు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి సాయం అందిస్తామని చెప్పిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరణలో శ్రద్ధ చూపకపోవడంతో 2019 ఆగస్టు నుంచి కొత్త పింఛన్ల మంజూరును మరిచిపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా మండలాల్లో పాత (65 ఏళ్ల వయసు) దరఖాస్తులు 800 వరకు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

48 వేల కొత్త దరఖాస్తులు

2022 ఆగస్టు 15న ఆసరా పింఛన్‌ వయసును 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు దరఖాస్తుల స్వీకరణకు కేవలం 15 రోజుల గడువు (అదే నెల ఆగస్టు 31 వరకు) ఇచ్చారు. దీంతో మీ సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా 48వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా చాంద్రాయణగుట్ట, ఆసి్‌ఫనగర్‌, గోల్కొండ, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, నాంపల్లి, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, మండలాల నుంచి ఎక్కువమంది ఆర్జీలు పెట్టుకున్నారు. అయితే 60 ఏళ్ల వయసుతో 2019 ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్న వారికే మంజూరు చేయని పరిస్థితి ఉండగా, 2022లో కొత్తగా ఆర్జీలు పెట్టుకున్న వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. కాగా, తమకు పింఛన్లు మంజూరు చేయాలని తహసీల్దార్‌ కార్యాలయాలు, కలెక్టరేట్‌ వద్దకు పాత దరఖాస్తుదారులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయితే 2019లో ఆర్జీలు పెట్టుకున్న వారికే మోక్షం లేదు.. మీకు (57 ఏళ్ల) ఇప్పట్లో ఎలా వస్తుందంటూ అధికారులు చెబుతుండడంతో కొత్త దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు.

సెర్ఫ్‌ నుంచి కలెక్టరేట్‌కు చేరని సంఖ్య

2019లో 65 ఏళ్ల వయసుతో దరఖాస్తు చేసుకున్న వారితోపాటు 2022లో ఆగస్టులో 57 ఏళ్ల వయసుతో మీ సేవ కేంద్రాల ద్వారా ఆర్జీలు పెట్టుకున్న వారి సంఖ్య ఇప్పటివరకు కలెక్టరేట్‌కు చేరుకోలేదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుదారుల సంఖ్య వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపిస్తామని, మంజూరైన తర్వాత లబ్ధిదారులకు అందజేస్తామని చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం పెండింగ్‌ దరఖాస్తులను పట్టించుకుని తమకు న్యాయం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

జిల్లాలో ఆసరా లబ్ధిదారులు

కేటగిరి - లబ్ధిదారుల సంఖ్య

వృద్ధులు - 1,08,985

వితంతు - 1,11,568

చేనేత కార్మికులు - 07

బీడి కార్మికులు - 54

హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు - 10,373

పైలేరియా - 40

డయాలసిస్‌ - 820

ఒంటరి మహిళలు - 11,225

దివ్యాంగులు - 30,818

మొత్తం - 2,73,890

Updated Date - Feb 23 , 2024 | 09:44 AM