Share News

Killer Soup: నెట్‌ఫ్లిక్స్‌ని షేక్‌ చేస్తున్న తెలంగాణ మహిళ మాస్టర్‌ ప్లాన్‌

ABN , Publish Date - Jan 26 , 2024 | 11:18 AM

ప్రస్తుతం ఓటీటీల్లో డాక్యుమెంటరీస్‌ హవా నడుస్తోంది. నిజ జీవితంలో జరిగిన కథలను తెరకెక్కిస్తూ సంచలన వ్యూస్‌ని సొంత చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం జాలీ జోసెఫ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించి కర్రీ అండ్‌ సైనెడ్‌ డాక్యుమెంటరీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రకంపనలు సృష్టించింది.

 Killer Soup: నెట్‌ఫ్లిక్స్‌ని షేక్‌ చేస్తున్న తెలంగాణ మహిళ మాస్టర్‌ ప్లాన్‌

హైదరాబాద్: ప్రస్తుతం ఓటీటీల్లో డాక్యుమెంటరీస్‌ హవా నడుస్తోంది. నిజ జీవితంలో జరిగిన కథలను తెరకెక్కిస్తూ సంచలన వ్యూస్‌ని సొంత చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం జాలీ జోసెఫ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించి కర్రీ అండ్‌ సైనెడ్‌ డాక్యుమెంటరీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రకంపనలు సృష్టించింది. వ్యూస్‌ పరంగా ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. అదే కోవలో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసిన కిల్లర్ సూప్‌ అనే వెబ్‌సిరీస్‌ సైతం మంచి వ్యూస్‌ని సొంతం చేసుకుంటుంది. ఇది 2007లో తెలంగాణలో జరిగిన ఓ సంచలన కేసు ఆధారంగా తెరకెక్కించగా.. ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మతి పోగొడుతుంది.

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు చాలా మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి.. అయినవాళ్లను కడదేరుస్తూ.. చివరికి ఊచలు లెక్కబెడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఓ సంచలన ఘటనే 2017లో చోటుచేసుకుంది. ప్రియుడి కోసం భర్తను హతమార్చి.. ప్రియుడే భర్త అని నమ్మించే ప్రయత్నంలో అడ్డంగా బుక్కైంది. నాగర్ కర్నూలు పట్టణంలో స్వాతి రెడ్డి, సుధాకర్‌ రెడ్డి అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే స్వాతి రెడ్డి.. రాజేష్‌ అనే వ్యక్తితో వివహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తపై ద్వేషం పెంచుకుంది. భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి.. అతడిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి మాస్టర్‌ స్కెచ్‌ వేసింది. మొదట మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి అడ్డు తొలగించుకోవాలని చూసినా.. అది ఫలించలేదు. దీంతో కొన్ని రోజుల తర్వాత ప్రియుడితో కలిసి ఇంట్లోనే తలపై కర్రతో దాడి చేసి భర్తను కడదేర్చింది. ఆ తర్వాత మృత దేహాన్ని కారు డిక్కీలో తీసుకెళ్లి కాల్చివేశారు.

ఇప్పటి వరకు అంతా ప్లాన్‌ ప్రకారమే చేసిన స్వాతి రెడ్డి, రాజేష్‌ ఆ తర్వాత అసలు ప్లాన్‌లోకి దిగారు. భర్త ప్లేస్‌లో స్వాతి రెడ్డి ప్రియుడు రాజేష్‌ని తీసుకువచ్చింది. తన భర్తపై యాసిడ్ దాడి జరిగిందని నమ్మించేలా.. రాజేష్ మొహం మీద యాసిడ్ పోసింది. హాస్పిటల్‌లో జాయిన్ చేసి సపర్యలు చేసింది. మొహమంతా కట్లు కట్టి ఉండటంతో సుధాకర్‌ రెడ్డి బంధువులకు కూడా అనుమానం రాలేదు. ఆసుపత్రిలో స్వాతి రెడ్డితో పాటు సుధాకర్‌ రెడ్డి అమ్మ ఉన్నా కూడా అసలు నిజం బయటపడకుండా స్వాతి రెడ్డి జాగ్రత్త పడింది. అయితే మటన్‌ సూప్‌ తాగిస్తే త్వరగా నయమవుతుందని సుధాకర్ రెడ్డి అమ్మకు ఎవరో చెప్పడంతో ఆమె మటన్‌ సూప్‌ తెచ్చి ఇచ్చింది. స్వాతి రెడ్డి కథ మొత్తం రివర్స్‌ కావడానికి ఇదే టర్నింగ్‌ పాయింట్‌ అయింది. స్వతహాగా వెజిటేరియన్‌ అయిన రాజేష్‌ ఆ మటన్‌ సూప్‌ తాగడానికి అంగీకరించలేదు. దీంతో సుధాకర్‌ రెడ్డి అమ్మకు అనుమానం వచ్చింది. ఎందుకంటే సుధాకర్‌కి మటన్‌సూప్‌ అంటే చాలా ఇష్టం. అలాంటింది దాన్ని తాగడానికి నిరాకరించడంతో అసలు అతడు తన కొడుకేనా అని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్వాతిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేయగా ఆమె మాస్టర్‌ ప్లాన్‌ విని పోలీసులు షాకయ్యారు. దాదాపు ఇదే స్టోరీలైన్‌ ఆధారంగా కిల్లర్ సూప్ అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌సిరీస్‌గా తీశారు. హర్షద్ నలవాడే, అనంత్ త్రిపాఠి ఉనైజా మర్చంట్‌తో కలిసి అభిషేక్ చౌబే నిర్మించారు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Updated Date - Jan 26 , 2024 | 11:36 AM