Share News

కేంద్రంలో కాంగ్రెస్సే!

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:09 AM

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించి అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు....

కేంద్రంలో కాంగ్రెస్సే!

ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది మా పార్టీనే

బీఆర్‌ఎస్‌ ఉనికి చాటే పరిస్థితి కూడా లేదు: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి సమక్షంలో జోరుగా పార్టీలోకి చేరికలు

బీజేపీ నేతలు పులిమామిడి రాజు, జలంధర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, బీఆర్‌ఎస్‌ నేత ముద్దగోని..

‘ఘట్‌కేసర్‌’ చైర్‌పర్సన్‌ పావని, మరో కౌన్సిలర్‌ సైతం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించి అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. శనివారం సీఎం సమక్షంలో కాంగ్రె్‌సలోకి ప్రతిపక్ష పార్టీల నుంచి జోరుగా చేరికలు కొనసాగాయి. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులైన అన్ని వర్గాల వారు పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని హామీనిచ్చారు. మక్తల్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జలంధర్‌రెడ్డి, ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి పులిమామిడి రాజు వేర్వేరుగా సీఎం సమక్షంలో ఆయన నివాసంలో కాంగ్రె్‌సలో చేరారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జలంధర్‌రెడ్డి పార్టీలో చేరగా.. మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ కార్యర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, మెదక్‌ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో పులిమామిడి రాజు చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, పీఆర్‌టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌ రెడ్డి కాంగ్రె్‌సలో చేరారు. సీఎం నివాసంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వీరు కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ కూడా సీఎం సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. హిమాయత్‌నగర్‌ కార్పొరేటర్‌ గడ్డం మహాలక్ష్మిగౌడ్‌, గన్‌ఫౌండ్రి మాజీ కార్పొరేటర్‌ మమత గుప్తా కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ కండువా కప్పి కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు. ఇటు బీఆర్‌ఎ్‌సకు చెందిన ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావని జంగయ్య యాదవ్‌, కౌన్సిలర్‌ సల్లూరి నాగజ్యోతితో కలిసి కాంగ్రె్‌సలో చేరారు. పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ డివిజన్‌కు చెందిన మహిళలు కాంగ్రె్‌సలో చేరారు. వారికి సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటు జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి దానం నాగేందర్‌ సమక్షంలో ఫిలింనగర్‌ బసవతారకంనగర్‌కు చెందిన ముస్లింలు కాంగ్రె్‌సలో చేరారు.

సీఎంను కలిసిన ఎంఆర్‌పీఎస్‌ నేతలు

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య, కోర్‌ కమిటీ సభ్యులు సీఎం రేవంత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వారు మీడియాకు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతునిస్తామనిసీఎం హామీనిచ్చారని వెల్లడించారు. ఎన్నికల తర్వాత పార్టీలో సముచిత స్థానం, రాజకీయ పదవులు ఇవ్వనున్నట్లు చెప్పారన్నారు.

దార్శనికుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌..

బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటుపడిన మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని సీఎం రేవంత్‌ కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి ఆయన భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. అంబేడ్కర్‌ 133వ జయంతి (ఏప్రిల్‌ 14)ని పురస్కరించుకొని సీఎం ఆయనను గుర్తు చేసుకున్నారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణకు జవజీవాలు పోసిందన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతోందని వెల్లడించారు.

ఆస్తులపై కేటీఆర్‌ లైడిటెక్టర్‌ పరీక్షకు రావాలి: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 13: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనకు అంటిన ఫోన్‌ ట్యాపింగ్‌ బురదను ఇతరులకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన చేశారని ఆరోపించారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని, దీనిపై లైడిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమా అంటూ కేటీఆర్‌ దిగజారుడుగా మాట్లాడుతున్నారని, తమ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. మీ మనుషులు, మీ కుటుంబ సభ్యులపై నమ్మకం లేక ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన నీచ సంస్కృతి మీదని, ఇలాంటి సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మీ కుటుంబాన్ని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 03:09 AM