Hyderabad: అసంక్రమిత వ్యాధులపై హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సమావేశం!
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:28 AM
అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ)పై నిర్వహించనున్న జాతీయ స్థాయి సమావేశానికి తెలంగాణ వేదిక కాబోతోంది. 2025 జనవరి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.

ఎన్‌సీడీపై తొలిసారి నగరంలో 8, 9 తేదీల్లో నిర్వహించనున్న కేంద్రం
పదేళ్లుగా ఢిల్లీకే పరిమితం
తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ)పై నిర్వహించనున్న జాతీయ స్థాయి సమావేశానికి తెలంగాణ వేదిక కాబోతోంది. 2025 జనవరి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా రెండేళ్లకోసారి ఢిల్లీలో ఎన్‌సీడీపై సమావేశం జరుగుతుంది. ఈ జాతీయ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్‌హెచ్‌ఎం ఎండీలు, ఎన్‌సీడీ ప్రోగ్రామ్ అధికారు (పీవో)లు హాజరవుతుంటారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇలాంటి జాతీయ స్థాయి సమావేశాన్ని ఇప్పటివరకు ఢిల్లీలో తప్ప ఇతర రాష్ట్రాల్లో నిర్వహించలేదు. పదేళ్లుగా ఈ సమావేశాలన్నీ ఢిల్లీకే పరిమితం అయ్యాయి. ఒక రాష్ట్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని వైద్య వర్గాలు తెలిపాయి.
మన దగ్గరే ఎందుకంటే..
దేశంలో ఇతర రాష్ట్రాలకంటే ఎన్‌సీడీ పరీక్షలు మన దగ్గర బాగా చేస్తున్నారు. అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, కేన్సర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలను 30 ఏళ్లు పైబడిన వారికి చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఏఎన్‌ఎం, ఆశాల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఎన్‌సీడీ స్ర్కీనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు మన దగ్గర ఎన్‌సీడీ పరీక్షలు పూర్తి చేశారు. 2017లో తొలిసారి ఎన్‌సీడీ పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో చేశారు. అనంతరం 2018 ఏప్రిల్‌లో ప్రారంభించి 2020 మార్చి వరకు మొదటి విడత 1.08 కోట్ల మందికి ఎన్‌సీడీ పరీక్షలు చేశారు. అందులో 9.8 లక్షల మంది రక్తపోటుతో, 5.2 లక్షల మంది మధుమేహంతోనూ బాధపడుతున్నట్లు తేలింది. ఆ తర్వాత 2021 ఏప్రిల్ నుంచి రెండో విడత పరీక్షలు ప్రారంభించి 2023 మార్చి వరకు పూర్తి చేశారు. ఇందులో భాగంగా 1.45 కోట్ల మందికి పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో 20.6 లక్షల మందికి బీపీ, మరో 9.80 లక్షల మందికి షుగర్ నిర్ధారణ అయింది. ఈ ఏడాది అంటే 2024 మే నుంచి మూడో విడత ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌ను ప్రారంభించి ఇంకా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు కోటిమందికిపైగా పరీక్షలు చేశారు. మూడోవిడత స్ర్కీనింగ్‌ను 2025 మార్చి నెలాఖరుల్లా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం గా పెట్టుకుంది. ఎన్‌సీడీ స్ర్కీనింగ్ విష యంలో ఇతర రాష్ట్రాలు ఒకటి, రెండు విడతలకే పరిమితం కాగా, మనదగ్గర మూడో విడత పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కిందటే ప్రారంభించింది. అంతేకాకుండా బీపీ, షుగర్ బాఽధితులకు నెలరోజులకు సరిపడా మందులిచ్చే కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీడీ కిట్లను కూడా ఉచితంగా పంపిణీ చేసింది. ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమా న్ని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా, మెరుగ్గా మనదగ్గర నిర్వహిస్తుండడంతో కేంద్రం దృష్టి తెలంగాణపై పడిం ది. దాంతో ఇక్కడ ఎన్‌సీడీ స్ర్కీనింగ్ ఎలా నిర్వహిస్తున్నారు? ఉచిత ఔషధ పంపిణీ ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో పరీక్షల్లో పాల్గొనే వైద్య సిబ్బంది దగ్గర ఎలాం టి టెస్టింగ్ మిషన్లు ఉన్నాయి? రోజుకు ఎంతమందిని పరీక్షిస్తున్నారు? అనే అంశాలపై ఇతర రాష్ట్రాల వారికి కూడా అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే ఎన్‌సీడీపై జాతీయ స్థాయి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది.
ఏర్పాట్లు చేయండి
జనవరిలో రెండు రోజుల పాటు ఈ జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తామని, సంబంధిత ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం ఎండీ ఆర్వీ కర్ణన్‌ను కోరింది. సోమవారం ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో ఈ జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి సౌరబ్ జైన్, ఎన్‌హెచ్‌ఎం ఎండీ ఆరాధన పట్నాయక్ హాజరుకానున్నారు. అలాగే అన్ని రాష్ట్రాల ఎన్‌హెచ్‌ఎం ఎండీలు, ఎన్‌సీడీ పీవోలు హాజరవుతారు. అలాగే కేన్సర్‌కు సంబంధించిన అంశాలపై ముంబై టాటా మెమోరియల్ కేన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ సుదీ్‌పగుప్తా, చండీగఢ్ బాబా కేన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ ఆశిష్ గులియా, ఐసీఎంఆర్ డైరెక్టర్ (ఎన్‌సీడీఐఆర్) ప్రశాంత్ మాథుర్‌ల కీలక ప్రసంగాలుంటాయి. బీపీ, షుగర్‌తో వచ్చే గుండెపోట్లు, వాటి నివారణ తదితర అంశాలపై ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ప్రముఖ వైద్యులు కూడా ప్రసంగించనున్నారు. రెండో రోజు నాలుగైదు జిల్లాల్లో కేంద్ర బృందంతో పాటు రాష్ట్రాల ఎన్‌హెచ్‌ఎం ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో నిర్వహిస్తున్న ఎన్‌సీడీ పరీక్షలను స్వయంగా పరిశీలించనున్నారు.