Hyderabad : సాగు చేయని భూములపై ఆరా!
ABN , Publish Date - Jul 17 , 2024 | 05:12 AM
రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై.. సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది. కామారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు), పంచాయతీ కార్యదర్శులు,
పైలట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో వివరాల సేకరణ
ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి పరిశీలన
రైతుభరోసా పథకం అమలు కోసమేనని రైతుల్లో చర్చ
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ భూములుగా నమోదై.. సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది. కామారెడ్డి, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు), పంచాయతీ కార్యదర్శులు, అందుబాటులో ఉన్న డీఆర్‌డీఏ సిబ్బంది ఈ వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని అమలు చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో.. సాగుచేయని భూములపై ఆరా తీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే ప్రతి సీజన్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబరులో.. ఏ రైతు.. ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. అయితే ధరణి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ, క్రాప్ బుకింగ్‌కు వచ్చేసరికి వానాకాలంలో కోటి 25 లక్షల ఎకరాల వరకు సాగవుతుండగా, యాసంగిలో 75 లక్షల ఎకరాలు దాటడంలేదు. మరోవైపు రాష్ట్రంలో శాశ్వత బీడు భూముల జాబితాలో 18.56 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటిలో రాళ్లు, రప్పలు, ముళ్లకంపలు ఉన్నప్పటికీ..
వ్యవసాయ భూముల జాబితాలో ఉండటంతో ప్రభుత్వం రైతుబంధు సాయం అందజేసింది. కాగా, ఏఈవోలు చేపట్టే క్రాప్ బుకింగ్‌లో ఇలాంటి భూములను ‘నో క్రాప్’ జాబితాలో రాస్తున్నారు. ప్రతి సీజన్‌లో ఈ భూములు నో క్రాప్ జాబితాలోనే ఉంటున్నాయి. అలాంటి వాటిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. కరీంనగర్, హనుమకొండ, ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేస్తున్నారు.
అయితే పంట వేయని భూముల వివరాలను రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచే పంపించారు. ఉదాహరణకు... కామారెడ్డి జిల్లాలో 35,368 సర్వే నెంబర్లను సర్వే కోసం ఇచ్చారు. ఈ సర్వే నంబర్లలో 15,075 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. దీనిపై ఏఈవో, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. ఇప్పటికే 35,365 సర్వే నంబర్లలో 15,068 ఎకరాల భూమిని పరిశీలించారు. ఇందులో 8,534 ఎకరాల్లో పంటలు వేస్తున్నారని, 6,535 ఎకరాల్లో సాగు చేయడంలేదని తేలింది. ఈ వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఇదే పద్ధతిలో మరో 4జిల్లాల్లో కూడా సర్వే సాగుతోంది. అయితే మొత్తం సర్వే నంబర్లపై కాకుండా.. కేవలం ఎంపిక చేసిన సర్వే నంబర్లపైనే ఈ సర్వే జరుగుతోంది. ఈ వారంలో సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి.