Share News

Hyderabad: రంబుల్‌ స్ట్రిప్స్‌.. వెన్నుకు చేటు! అవస్థలు పడుతున్న వాహనదారులు

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:11 PM

స్పీడ్‌బ్రేకర్ల(Speedbreakers)తో ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా జీహెచ్‌ఎంసీ(GHMC) ఏర్పాటు చేసిన రంబుల్‌ స్ర్టిప్స్‌ ప్రయాణికులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

Hyderabad: రంబుల్‌ స్ట్రిప్స్‌.. వెన్నుకు చేటు! అవస్థలు పడుతున్న వాహనదారులు

- డిస్క్‌లపై ప్రభావం.. స్పాండిలైటిస్‌ సమస్య తీవ్రం

- గ్రేటర్‌లో ఐఆర్‌సీ ప్రమాణాలకు విరుద్ధంగా నిర్మాణం

- తొలగింపును పట్టించుకోని జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ సిటీ: స్పీడ్‌బ్రేకర్ల(Speedbreakers)తో ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా జీహెచ్‌ఎంసీ(GHMC) ఏర్పాటు చేసిన రంబుల్‌ స్ర్టిప్స్‌ ప్రయాణికులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్(ఐఆర్‌సీ) ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన వీటిని ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం రంబుల్‌ స్ర్టిప్స్‌ 5మిల్లిమీటర్ల కంటే తక్కువ మందంతో ఉండాలి. నగరంలోని రహదారులపై 10, 15 ఎంఎం మందంతో ఉన్నాయి. అడుగుకు ఒకటి చొప్పున ఒక్కో ప్రాంతంలో ఆరు స్ర్టిప్స్‌ మాత్రమే ఉండాలి. పలు ప్రాంతాల్లో 10 నుంచి 15, అంతకంటే ఎక్కువ స్ర్టిప్స్‌ కనిపిస్తున్నాయి. ఎక్కువ మందం, రెట్టింపు స్ర్టిప్స్‌ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుదుపునకు గురవుతుండడంతో వాహనాలతోపాటు పౌరుల ఆరోగ్యమూ పాడవుతోంది.

వేగం తగ్గించడం లేదంటూ..

‘5 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందంతో రంబుల్‌ స్ర్టిప్స్‌ ఉంటే వాహనదారులు వేగం తగ్గించడం లేదు. వాహనం కూడా తక్కువ వైబ్రేట్‌ అవుతుంది. అందుకే 7.5నుంచి 10 మిల్లీమీటర్ల మందంతో గతంలో ఏర్పాటు చేశాం’ అని ఇంజనీరింగ్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. కార్యాలయాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలపై, ఎక్కువ సమయం కూర్చొని ఇతరత్రా పనులు చేసే వారిలో చాలామంది స్పాండిలైటిస్‌, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారని, ఇలాంటి వారికి రంబుల్‌ స్ర్టిప్స్‌ వల్ల ఇబ్బందులు అధికమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

యథేచ్ఛగా స్ట్రిప్స్‌ ఏర్పాటు..

ఐటీ కారిడార్‌లోని ఓ రహదారిపై 50 మీటర్ల మేర స్ర్టిప్స్‌ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా గతంలో పౌరులు ఫిర్యాదు చేయగా అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. రంబుల్‌ స్ర్టిప్స్‌ వెంటనే తొలగించాలని, ఇక ముందు ఎక్కడా నిర్మించవద్దని అధికారులను ఆదేశించారు. ఐటీ కారిడార్‌లోని ఒకటి, రెండు ప్రాంతాలు మినహా ఎక్కడా తొలగించిన దాఖలాలు లేవు. కొత్త స్ర్టిప్స్‌ ఏర్పాటు యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇటీవల బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-3లోని ఓ మసీద్‌ వద్ద, పంజాగుట్ట నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలో రంబుల్‌ స్ర్టిప్స్‌ నిర్మించారు. ఇవి కూడా ఎక్కువ మందంతో ఉండడం గమనార్హం.

వంతెనలపై మరీ ఘోరం

ఫ్లై ఓవర్లపై నిర్ణీత స్థాయి వేగం దాటి ప్రయాణించకుండా రంబుల్‌ స్ర్టిప్స్‌ ఏర్పాటు చేశారు. మెజార్టీ వంతెనలపై ఎక్కే, దిగే చోట 100-200 మీటర్ల దూరంలోనే నాలుగైదు చోట్ల రంబుల్‌ స్ర్టిప్స్‌ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్లు ఎక్కడం కంటే.. కొంచెం ఆలస్యమైనా కింది నుంచి వెళ్లడమే మంచిదని వాహనదారులు భావిస్తున్నారు.

క్రమేణా మందం తగ్గుతుంది

పోలీస్‌ విభాగం ఇచ్చిన వివరాల ఆధారంగా ఆయా ప్రాం తాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో ఇదొకటి. గతంలో 7.5 నుంచి 10 మిల్లీమీటర్ల మందంతో రంబుల్‌ స్ర్టిప్స్‌ ఏర్పాటు చేశాం. దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో రెండు, మూడు చోట్ల స్ర్టిప్స్‌ తొలగించాం. దీంతో అక్కడి రోడ్లు పాడవుతున్నాయి. అందుకే ఆ పనులు నిలిపేశాం. కాలగమనంలో మందం తగ్గి సాధారణంగా మారుతాయి. ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ మందంతో కొత్త స్ర్టిప్స్‌ ఏర్పాటు చేస్తున్నాం.

- ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారి, జీహెచ్‌ఎంసీ

డిస్క్‌ అరుగుదలతో నరంపై వత్తిడి

వెన్ను, సర్వైకల్‌ స్పాండిలైటి్‌సతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువైంది. రోజూ ఓపీలో 70 శాతం ఇలాంటి కేసులే ఉంటున్నాయి. 22 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు వారే ఎక్కువమంది బాధితులుగా ఉన్నారు. నడుము, మెడ, మోకాళ్ల నొప్పలతో వస్తున్నారు. ప్రయాణం చేస్తున్న సమయంలో జర్కులు జరిగితే ఆ ప్రభావం వెన్నుపైనే పడుతుంది. తద్వారా డిస్కులు, ఎముకలు దెబ్బతింటున్నాయి. కొన్నిసార్లు ఫ్రాక్చర్లు జరుగుతున్నాయి. ఎముకలు, వెన్ను బలహీనంగా మారుతున్నాయి. డిస్క్‌ అరిగిపోవడం వల్ల ఆ వత్తిడి నరంపై పడి నొప్పి ఏర్పడుతుంది. ఈ ప్రభావం నడుము నుంచి కింది పాదం వరకు ఉంటుంది. ఇది సయాటికా సమస్యకు దారి తీస్తుంది. కొన్నిసార్లు రెండు కాళ్లు బలహీనంగా మారే ముప్పు ఉంది. అధిక బరువు ఉన్న వారిలో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.

- డాక్టర్‌ విశ్వక్‌సేనారెడ్డి, సీనియర్‌ న్యూరోసర్జరీ, స్టార్‌ ఆస్పత్రి

Updated Date - Mar 09 , 2024 | 12:11 PM