Share News

Hyderabad : సచివాలయంలో నిలిచిన ఇంటర్నెట్‌, ఇంటర్‌కమ్‌!

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:06 AM

రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్‌, ఇంటర్‌కమ్‌ సేవల్లో అంతరాయం కలిగింది. ఏదో కొద్దిసేపు కాదు.. ఏకంగా మూడు నాలుగు గంటల పాటు ఈ సేవలు స్తంభించిపోయాయి.

Hyderabad : సచివాలయంలో నిలిచిన ఇంటర్నెట్‌, ఇంటర్‌కమ్‌!

  • 3, 4 గంటలపాటు స్తంభించిన సేవలు

  • కలెక్టర్లతో రేవంత్‌ భేటీ సమయంలోనే !

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలో ఇంటర్నెట్‌, ఇంటర్‌కమ్‌ సేవల్లో అంతరాయం కలిగింది. ఏదో కొద్దిసేపు కాదు.. ఏకంగా మూడు నాలుగు గంటల పాటు ఈ సేవలు స్తంభించిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్‌, ఇంటర్‌కమ్‌ పనిచేయలేదు. ఏ కారణంతో ఇంటర్నెట్‌ నిలిచిపోయిందన్నది కూడా ఉద్యోగులకు తెలియకపోవడం గమనార్హం. సచివాలయం లోపల ఉన్న అన్ని అంతస్తులకు అనుసంధానమై ఉండే ఇంటర్‌కమ్‌ (ల్యాండ్‌ ఫోన్లు)లు కూడా పనిచేయలేదు.

దీంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇంటర్నెట్‌, ఇంటర్‌కమ్‌ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. సచివాలయంలోని ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించిన సమయంలోనే ఇంటర్నెట్‌, ఇంటర్‌కమ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కాగా, సచివాలయానికి ఇంటర్నెట్‌ అందించే సంస్థకు సమయానికి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, అందుకే ఆ సంస్థ నెట్‌ను నిలిపివేసిందన్న ప్రచారం జరిగింది. సాంకేతిక కారణాలతోనే సేవల్లో అంతరాయం ఏర్పడిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

పార్కింగ్‌ పకడ్బందీగా..

సాధారణ సమయాల్లోనే మంత్రులు, అధికారులు, వీఐపీల కార్లతో కిటకిటలాడే సచివాలయం పార్కింగ్‌ ఏరియా మంగళవారం కలెక్టర్ల సదస్సు జరిగినా ఎలాంటి హడావుడి లేకుండా దర్శనమిచ్చింది. సచివాలయ భద్రతా విభాగం సిబ్బంది కార్లలో వస్తున్నవారి వివరాలను సేకరించి, పరిశీలించిన తర్వాతే పార్కింగ్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో ఎప్పుడూ లేని విఽధంగా పార్కింగ్‌లో ఖాళీ స్థలం కనిపించింది.

Updated Date - Jul 17 , 2024 | 04:06 AM