Share News

Hyderabad: నగరం నలువైపులా.. మెట్రో రెండో దశ పొడిగింపులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:17 AM

నగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రోను నలుదిశలా విస్తరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Hyderabad: నగరం నలువైపులా.. మెట్రో రెండో దశ పొడిగింపులు

- బీహెచ్‌ఈఎల్‌ - పటాన్‌చెరుతో శివారు కనెక్టివిటీకి చర్యలు

- ఐటీ కారిడార్‌కు మెరుగైన రవాణా

- కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి

- పాతబస్తీ మార్గంపై ఫోకస్‌

ఎంజీబీఎస్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ, ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌కు అనుసంధానంగా పటాన్‌చెరు వరకు, ఎల్‌బీనగర్‌ టు హయత్‌నగర్‌, రాయదుర్గ్‌ టు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌.. ఇలా కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. నగరం నలువైపులా మెట్రో కనెక్టివిటీ ఉండనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా, వేగవంతమైన ప్రయాణం చేసే అవకాశం కల్పించేలా కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగర రవాణాలో అత్యంత కీలకమైన మెట్రోను నలుదిశలా విస్తరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. 2017 నవంబర్‌లో ప్రారంభమైన రైళ్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు గత ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు మెట్రో ప్రతిపాదనలు తయారుచేసినా ఆచరణలో పెట్టలేదు. దీంతో మెట్రో మొదటి దశలో నడుస్తున్న రైళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

ఐటీ కారిడార్‌కు మరింత ఉపయోగపడేలా..

నగరంలో అతి కీలకమైన రాయదుర్గం(Rayadurgam) నుంచి బయో డైవర్సిటీ జంక్షన్‌ - ఐఐటీ - ఐఎస్బీరోడ్డు - విప్రో లేక్‌ - అమెరికన్‌ కాన్సులేట్‌ (ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌) మార్గంలో 12 కిలోమీటర్ల వరకు కనెక్టివిటీ పెంచి ఐటీ కారిడార్‌కు మరింత ఉపయోగపడేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఎందుకంటే నగరంలోని దాదాపు 65 శాతం మంది ఐటీ ఐద్యోగులు హైటెక్‌సిటీ, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేస్తుంటారు. వీరంతా ప్రతిరోజు బైక్‌లు, కార్లపై అక్కడికి వెళ్తుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఈ రెండు రూట్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ 8 కిలోమీటర్లను కలపడం ద్వారా విజయవాడ, నల్లగొండ నుంచి వచ్చేవారు సులువుగా మెట్రోలో ప్రయాణించవచ్చు.

పాతబస్తీ పూర్తితో అభివృద్ధి..

నగరంలో పాతబస్తీ అభివృద్ధిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మెట్రో రైలు ప్రతిపాదన ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆగిపోయింది. ఇదిగో చేస్తాం.. అదిగో చేస్తామని ఊరిస్తున్నారే కానీ.. చేసిన వారు లేకపోయారు. ఈ తరుణంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్లను పూర్తి చేయడంతోపాటు ఇదే మార్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోను తీసుకెళ్లడం ద్వారా ఊహించని అభివృద్ధి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా రెండో దశ విస్తరణతో నగరం చుట్టూ మెట్రోలో తిరిగే అవకాశం నగరవాసులకు కలగనుంది.

తాజాగా పలు మార్పులు

గత ప్రభుత్వం చేపట్టని పనులను ప్రస్తుత ప్రభుత్వం చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఉన్న కారిడార్లకు అనుసంధానంగా మెట్రోరూట్‌ను మరింత పొడిగించాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా కారిడార్‌-1 ఎల్‌బీనగర్‌-మియాపూర్‌కు అనుసంధానంగా పటాన్‌చెరు వరకు పొడిగించనున్నారు. మియాపూర్‌ స్టేషన్‌ నుంచి బీహెచ్‌ఎల్‌-పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్లను పూర్తి చేయడం ద్వారా సంగారెడ్డి నుంచి నగరానికి వచ్చే ప్రజలకు మెట్రో రవాణా అందనుంది.

Updated Date - Jan 03 , 2024 | 11:17 AM