Share News

Gorrepati Madhavarao: మానవ హక్కుల నేత గొర్రెపాటి కన్నుమూత

ABN , Publish Date - Dec 29 , 2024 | 04:18 AM

మానవ హక్కుల ఉద్యమ నేత గొర్రెపాటి మాధవరావు (67) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య మీనా సహాని, కుమార్తెలు మానస, మధుమిత ఉన్నారు.

Gorrepati Madhavarao: మానవ హక్కుల నేత గొర్రెపాటి కన్నుమూత

  • విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాలవైపు.. నాలుగు దశాబ్దాల అలుపెరుగని పోరాటం

  • నేడు అంతిమయాత్ర.. మృతదేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత

సుభా్‌షనగర్‌ (నిజామాబాద్‌), డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల ఉద్యమ నేత గొర్రెపాటి మాధవరావు (67) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఆయనకు భార్య మీనా సహాని, కుమార్తెలు మానస, మధుమిత ఉన్నారు. గొర్రెపాటి ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా గురునాథపాలెంలో 1957 మార్చి 4న జన్మించారు. అదే సంవత్సరం ఆయన తల్లిదండ్రులు తెలంగాణకు వలసవచ్చి నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌ గ్రామంలో స్థిరపడ్డారు. దాంతో ఆయన ఇంటర్మీడియేట్‌ వరకు నిజామాబాద్‌ జిల్లాలో, తర్వాత హైదరాబాద్‌లో చదువుకున్నారు. విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులైన ఆయన నాలుగు దశాబ్దాల పాటు మానవ హక్కుల రంగంలో అలుపెరగని పోరాటం చేశారు. రాజ్యహింస ఎక్కడ జరిగినా ఎదిరించడంలో గొర్రెపాటి ముందుండేవారు. విప్లవ సాహిత్యంపై మక్కువతో రచనలు, అనువాదాలు చేశారు. ‘ఉపా’లాంటి వివాదాస్పద చట్టాలపై విలువైన వ్యాసాలు రాశారు. చట్టాల్లోని సంక్లిష్టమైన అంశాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రచనలు చేశారు. న్యాయవాద వృత్తిలో సైతం రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు ఎదుర్కొన్న విద్యార్థుల తరఫున ఉచితంగా వాదించారు. మూడు ఎన్‌కౌంటర్లలో పోలీసులు, ప్రభుత్వంపై కేసులు వేసి గెలిచి.. బాధితులకు నష్టపరిహారం వచ్చేలా చేశారు. నిజామాబాద్‌ ద్వారకానగర్‌లో గుడిసెవాసుల తరఫున వాదించి వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. తెలంగాణ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యార్థులకు బోధించారు. మొదట ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘంలో పనిచేసిన ఆయన తర్వాత మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యుడిగా, రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.

నేత్ర, శరీరదానం

గొర్రెపాటి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నిజామాబాద్‌ ఎల్లమ్మగుట్టలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆదివారం ఆయన అంతిమయాత్ర నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేయనున్నారు. ఆయన నేత్రాలను లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సేకరించారు. గొర్రెపాటి మృతికి మానవహక్కుల వేదిక, పలువురు వామపక్ష నాయకులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు.

Updated Date - Dec 29 , 2024 | 04:18 AM