Ghanta Chakrapani: అంబేడ్కర్ వర్సిటీ వీసీగా ఘంటా..
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:29 AM
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
అనూహ్యంగా చక్రపాణి నియామకం.. ఉత్తర్వులు జారీ
గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు
న్యాయ సలహా తర్వాతే నియామకంపై ముందుకు?
జేఎన్టీయూ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జేఎన్టీయూ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇటీవలే వీసీలను నియమించిన విషయం తెలిసిందే. అయితే, వివిధ కారణాలతో అంబేద్కర్, జేఎన్టీయూ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎ్‌ఫఏయు) వీసీల నియామకాలు నిలిచిపోయాయి. తాజాగా అంబేద్కర్ వర్సిటీకి వీసీని నియమించారు. కాగా, గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) చైర్మన్‌గా పనిచేసిన ఘంటా చక్రపాణిని అంబేద్కర్ వర్సిటీ వీసీగా నియమించే విషయంలో ప్రభుత్వం న్యాయసలహా తీసుకున్నట్లు సమాచారం.
సాధారణంగా అయితే.. వీసీ పదవి చేపట్టాలంటే ప్రొఫెసర్‌గా కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. కానీ, చక్రపాణికి 8 ఏళ్ల అనుభవం మాత్రమే ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా పనిచేసి రిటైర్ అయిన వాళ్లని ప్రభుత్వ పోస్టుల్లో నియమించరాదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నియామకం ఆలస్యమైందని, న్యాయ సలహా తీసుకున్న తర్వాతే చక్రపాణి నియామకం ఫైల్‌ను గవర్నర్ ఆమోదానికి పంపించారని తెలిసింది. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా మొదట్లో చక్రపాణి పేరు ప్రభుత్వం దృష్టిలో లేదని, సామాజిక సమీకరణలు, రాజకీయ కోణాల్లో ఆయన పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. మరోవైపు, జేఎన్టీయూ వర్సిటీకి వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ముగ్గురిని కాదని ప్రభుత్వం బాలకిష్టారెడ్డిని నియమించడం గమనార్హం. జేఎన్టీయూ వర్సిటీ వీసీ నియామకానికి త్వరలో మరో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.