Share Market Loss: ట్రేడింగ్‌లో రూ.30 లక్షల నష్టం కుటుంబం ఆత్మహత్య
ABN , Publish Date - Dec 12 , 2024 | 02:34 AM
షేర్ మార్కెట్లో నష్టాలు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. ట్రేడింగ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ఉద్దేశంతో అప్పుతెచ్చి, పెట్టుబడులు పెడితే.. అనుభవరాహిత్యం కాటేసింది..! రూ.30 లక్షలు ఆవిరైపోయాయి.
షేర్ల కోసం అధిక వడ్డీకి అప్పులు
అనుభవం లేక భారీ నష్టాలు
పురుగుల మందు తాగిన కుటుంబం
భార్య, భర్త, కొడుకు, కుమార్తె మృతి
మంచిర్యాల జిల్లా తాండూరులో విషాద ఘటన
మంచిర్యాల, తాండూర్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): షేర్ మార్కెట్లో నష్టాలు ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. ట్రేడింగ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే ఉద్దేశంతో అప్పుతెచ్చి, పెట్టుబడులు పెడితే.. అనుభవరాహిత్యం కాటేసింది..! రూ.30 లక్షలు ఆవిరైపోయాయి. నెలకు 5-10ు వడ్డీకి తెచ్చిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక.. అప్పుల వారి వేధింపులు తాళలేక ఓ నిండు కుటుంబం శీతల పానీయంలో పురుగు మందు కలుపుకొని తాగి, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామంలో చోటుచేసుకుంది. తాండూరు పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య(60), శ్రీదేవి(55) దంపతులకు కుమారుడు శివప్రసాద్(26), మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్న కుమార్తె శ్రీచైతన్య(22) ఉన్నారు. మొండయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా.. ఆయన కుమారుడు శివప్రసాద్ బెల్లంపల్లిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసేవారు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆశతో శివప్రసాద్ కాసిపేట, బెల్లంపల్లిలో తెలిసిన వారి వద్ద రూ.10 లక్షలు అప్పుచేశారు.
నూటికి రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ ఇస్తుండడంతో.. అతనికి అప్పులిచ్చేందుకు పలువురు ముందుకొచ్చేవారు. మొదట్లో వచ్చే కొద్దిపాటి లాభంతో వడ్డీలు చెల్లించేవారు. నష్టాలు రావడంతో మరోమారు రూ.20 లక్షల మేర అప్పు చేశారు. షేర్‌మార్కెట్‌పై అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడంతో.. అవికూడా ఆవిరైపోయాయి. వడ్డీ చెల్లించే పరిస్థితి లేక.. ఇల్లు వదిలి పారిపోయాడు. విజయవాడలో.. ప్రకాశం బ్యారేజీ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు అడ్డుకుని, స్వగ్రామానికి పంపారు. దీంతో.. అప్పులిచ్చినవారు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టి.. మొండయ్య, శ్రీదేవిపై ఒత్తిడి తీసుకువచ్చారు. తరచూ అప్పుల వాళ్లు ఇంటికి వస్తూ.. డబ్బుల కోసం ఒత్తిడి తీసుకొస్తుండడంతో.. కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో.. మంగళవారం తెల్లవారుజామున శీతల పానీయంలో పురుగు మందు కలుపుకొని, సేవించారు. ఆ తర్వాత మొండయ్య తన బావమరిది కోలేటి రమేశ్‌కు ఫోన్‌చేసి, తామంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. దాంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న రమేశ్.. అపస్మారక స్థితిలో పడిపోయిన మొండయ్య కుటుంబాన్ని అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మొండయ్య మంగళవారం రాత్రి 10.30 సమయంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం శ్రీదేవి, శ్రీచైతన్య.. సాయంత్రం శివప్రసాద్ మృతిచెందారు. రమేశ్ ఫిర్యాదు మేరకు తాండూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏడాదిలో పది మంది..
షేర్ మార్కెట్, ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా మంచిర్యాల జిల్లాలో ఏడాది కాలంలో పది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాసిపేటలో మొండయ్య కుటుంబం మృతిచెందగా.. ఈ ఏడాది ఆగస్టులో జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. లోన్‌యా్‌పల వేధింపులతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే ఇప్ప వెంకటేశ్, తన భార్య వర్షిణి, కుమారులు రిషికాంత్, విహాంత్‌కు విషమిచ్చి చంపేసి, తానూ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని హమాలివాడకు చెందిన ఓ యువతి కూడా లోన్‌యా్‌ప నిర్వాహకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. లక్షెట్టిపేటలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టాల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.