Share News

Etala Rajender: కేసీఆర్‌ తప్పులు చెప్పగలిగింది నేనొక్కణ్నే.. అందుకే గెంటేశారు!

ABN , Publish Date - May 08 , 2024 | 05:13 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్‌ చేసింది తప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి తానేనని.. అందుకే తనను బయటకు గెంటేశారని మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు.

Etala Rajender: కేసీఆర్‌ తప్పులు చెప్పగలిగింది నేనొక్కణ్నే.. అందుకే గెంటేశారు!

బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులకు గౌరవం లేదు

  • మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించేవారు కాదు

  • కారు, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

  • ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఈటల

హైదరాబాద్‌ సిటీ, మే 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్‌ చేసింది తప్పు అని చెప్పగలిగిన ఏకైక మంత్రి తానేనని.. అందుకే తనను బయటకు గెంటేశారని మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం ఇక్కడ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అప్పట్లో హౌసింగ్‌ పాలసీ మీద ఒక కమిటీ వేశారని.. తాను, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు తదితర మంత్రులు ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నామని.. కానీ, తమ కమిటీ రిపోర్టు ఇవ్వకముందే హౌసింగ్‌ పాలసీని కేసీఆర్‌ డిక్లేర్‌ చేసేశారని ఈటల వెల్లడించారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేసీఆర్‌కు మంత్రులంటే ఏ మాత్రం గౌరవం లేదని.. తమను కనీసం మనుషులుగా కూడా గుర్తించేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ కేసీఆర్‌ గుప్పిట్లోనే ఉన్నా.. తన భూముల విషయంలో చేసిన ఆరోపణలు నిజం కాదు కాబట్టే, ఆయన తనను ఏమీ చేయలేకపోయారని ఈటల గుర్తుచేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని.. ప్రజలు బీజేపీనే నమ్ముకున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు గుర్తుపట్టట్లేదని.. వారిద్దరూ తనకసలు పోటీయే కాదని వ్యాఖ్యానించారు. అయితే.. తనను ఎలాగైనా మల్కాజిగిరిలో ఓడించాలని ప్లాన్‌ చేస్తున్నారని.. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, వారిది అంత సంకుచిత మనస్తత్వం కాదని ఈటల విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే సంస్థలకూ అందనిఫలితం మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రాబోతోందని జోస్యం చెప్పారు.


ఇక.. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్‌ రెడ్డి తన గత వైఖరి మార్చుకుంటారని భావించామని, కానీ ఆయన ఏమాత్రం మారలేదని.. ఆయన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకిచ్చిన ఏ హామీనీ సరిగ్గా నెరవేర్చలేదని ఈటల అసంతృప్తి వెలిబుచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంత హడావుడి చేసీ, ఏ చర్యలూ తీసుకోలేదని.. కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని.. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో కూడా చర్యలు లేవని విమర్శించారు. ‘‘కేసీఆర్‌ విఫలమవడానికి చాలా సమయం పట్టింది. కానీ రేవంత్‌ రెడ్డి నాలుగు నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు’’ అని వ్యాఖ్యానించారు.


ఫేక్‌ వీడియోలతో జాగ్రత్త..

తాను మల్కాజిగిరి ప్రజలను తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఒక వీడియో సర్క్యులేట్‌ అవుతోందని ఈటల రాజేందర్‌ ఆందోళన వెలిబుచ్చారు. కానీ, ఇన్నేళ్లుగా తనను చూస్తున్న ప్రజలు ఆ ఫేక్‌ వీడియోను నమ్మరని.. కృత్రిమ మేధ సాయంతో ఇలాంటి వీడియోలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే.. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయబోతోందంటూ కూడా మార్ఫింగ్‌ వీడియోలతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా.. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు డబ్బులకు లొంగుతారని ఈటల అన్నట్టుగా ఓ ఫేక్‌ వీడియోను సర్క్యులేట్‌ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు సీఈవో వికా్‌సరాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన కాంగ్రెస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.

Updated Date - May 08 , 2024 | 05:13 AM