Share News

Amberpet: వృద్ధ దంపతుల దారుణ హత్య..

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:19 AM

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఒంటరిగా నివాసముంటున్న వారిని డబ్బు కోసమే ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Amberpet: వృద్ధ దంపతుల దారుణ హత్య..

  • హైదరాబాద్‌, అంబర్‌పేటలో ఘటన

అంబర్‌పేట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడడంతో ఒంటరిగా నివాసముంటున్న వారిని డబ్బు కోసమే ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాచిగూడ ఏసీపీ రఘు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరి లింగారెడ్డి(75), ఊర్మిళాదేవి దంపతులు బాగ్‌ అంబర్‌పేట డీడీ కాలనీలో నివాసముంటున్నారు. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా వివాహం అనంతరం వారంతా అమెరికాలో ఉంటున్నారు. లింగారెడ్డి.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మేనేజర్‌గా పదిహేనేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు.


ప్రస్తుతం దంపతులు మాత్రమే ఉంటుండంతో లింగారెడ్డి తన నివాసంలోని ఓ వాటాను అద్దెకు ఇచ్చారు. లింగారెడ్డి ఇంట్లో పని చేసే వ్యక్తుల్లో ఒకరు సోమవారం నుంచి పనికి రావడం లేదు. మరొకరు గురువారం ఉదయం వచ్చి పని చేసి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. లింగారెడ్డి దంపతులు కూడా గురువారం నుంచి బయటకు రాలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అద్దెకు ఉంటున్న వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా లింగారెడ్డి దంపతులు విగతజీవులై పడి ఉన్నారు. దంపతులిద్దరి తలలపై బలమైన గాయాలున్నాయి. ఇంట్లోని బీరువా, ఆల్మరాలు తెరచి ఉన్నాయి. దొంగతనానికి వచ్చిన వారే దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - Oct 20 , 2024 | 03:19 AM