Share News

E-Car Racing: రయ్.. రయ్.. నై.. ఈ- కార్‌ రేసింగ్‌పై నీలినీడలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:50 AM

ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో గతేడాది ఫార్ములా ఈ-ఫిక్స్‌ కార్‌ రేస్‌(E-Fix Car Race) నిర్వహణకు క్యాలెండర్‌ ప్రకటించగా, అందులో ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లోని ప్రధాన నగరాలున్నాయి.

E-Car Racing: రయ్.. రయ్.. నై.. ఈ- కార్‌ రేసింగ్‌పై నీలినీడలు

- ప్రభుత్వం మారడంతో అనిశ్చితి

- అనుమతి కోసం ఎదురుచూపులు

- సమీపిస్తున్న గడువు

- ముందుకు రాని ప్రమోటర్లు

- ప్రభుత్వంపై రూ.200 కోట్ల వరకు భారం

అంతర్జాతీయ స్థాయి ఈ-రేసింగ్‌కు హైదరాబాద్‌ మరోసారి వేదిక అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన రేసింగ్‌ పై అనిశ్చితి నెలకొంది. గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ గార్డెన్‌ చుట్టూ స్ర్టీట్‌ సర్క్యూట్‌ ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా రేస్‌ నిర్వహించింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో రెండోసారి నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో గతేడాది ఫార్ములా ఈ-ఫిక్స్‌ కార్‌ రేస్‌(E-Fix Car Race) నిర్వహణకు క్యాలెండర్‌ ప్రకటించగా, అందులో ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లోని ప్రధాన నగరాలున్నాయి. వాటిల్లోంచి తొలిసారిగా భారత్‌ను ఎంపిక చేసి హైదరాబాద్‌ను వేదికగా చేశారు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఫార్ములా ఈ- రేస్‌ కావడంతో నిర్వహణకు ప్రమోటర్‌గా ముందుకొచ్చిన గ్రీన్‌కో సంస్థతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అందుకనుగుణంగానే హైదరాబాద్‌(Hyderabad) నడిబొడ్డున హుస్సేన్‌సాగర్‌ తీరాన గల ఎన్టీఆర్‌ గార్డెన్‌ చుట్ట్టూరా ఏడు మలుపులతో 2.75 కి.మీ వచ్చేవిధంగా స్ర్టీట్‌ సర్య్కూట్‌ ట్రాక్‌ను డిజైన్‌ చేసి ఏర్పాట్లు చేశారు. ఈ రేసును అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టింది. కార్‌ రేస్‌కు ప్రమోటర్‌గా ఉన్న గ్రీన్‌కో సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయగా, నిర్వహణ వ్యయమంతా ఆ సంస్థే భరించింది. కేవలం ట్రాక్‌ ఏర్పాట్లను మాత్రమే హెచ్‌ఎండీఏ చేపట్టింది. అయితే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా రేస్‌ నిర్వహణ తర్వాత 84 మిలియన్‌ డాలర్ల వరకు అంటే సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ కార్‌ రేస్‌ 2024 క్యాలెండర్‌ షెడ్యూల్‌లో ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్స్‌ భారత్‌ను మరోసారి ఎంపిక చేసింది. హైదరాబాద్‌ వేదికగా 2024 ఫిబ్రవరి 10న ఈ రేస్‌ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా ఈ ఏడాది అక్టోబర్‌ 23న అప్పటి ప్రభుత్వంలోని మున్సిపల్‌ శాఖతో ఒప్పందం చేసుకుంది. అయితే, రేస్‌కు గడువు సమీపిస్తుండగా ఇంకా ఏర్పాట్లు మాత్రం ప్రారంభం కాలేదు.

నిర్వహణకు భారీ వ్యయం

2023 ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ నిర్వహణ, ఏర్పాట్లకు ప్రమోటర్‌గా ఓ సంస్థ ముందుకు వచ్చింది. ట్రాక్‌ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.5కోట్ల వ్యయాన్ని హెచ్‌ఎండీఏ భరించింది. మిగతా నిర్వహణ ఏర్పాట్లన్నీ ప్రమోటర్‌ సంస్థనే చూసుకుంది. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించే కార్‌ రేసింగ్‌ నిర్వహణకు ఏ సంస్థా ముందుకు రాలేదని తెలిసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే కార్‌ రేస్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ కార్‌ రేస్‌ ట్రాక్‌, రేసింగ్‌ నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లు, మార్కెటింగ్‌, క్యాంపెయిన్‌, వివిధ దేశాల నుంచి వచ్చే రేసర్లకు సౌకర్యాల కల్పన వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు రూ.200 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది.

రూ.150 కోట్లు అవసరం

రెండో ఫార్ములా ఈ-రేస్‏కు ఏర్పాట్లు చేయడానికి ఓ సంస్థకు అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ రూ.50కోట్ల వరకు ఇప్పటికే చెల్లించినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రంలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ-రేస్‌ నిర్వహణకు ప్రభుత్వం ఆసక్తి చూపుతుందా? రేస్‌ నిర్వహణ, ఏర్పాట్లకు మరో రూ.150 కోట్ల వ్యయాన్ని భరిస్తుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. హుస్సేన్‌సాగర్‌ తీరాన స్ర్టీట్‌ సర్య్కూట్‌ ఏర్పాటు చేసి కార్‌ రేస్‌ నిర్వహించడంతో హైదరాబాద్‌ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వెళ్లగా, అదే సందర్భంలో నగరవాసులకు ట్రాఫిక్‌ ఇక్కట్లు కలిగిస్తూ నగరం నడిబొడ్డున కార్ల రేస్‌ నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏ వైపు మొగ్గు చూపుతుందనే ఆసక్తి నెలకొన్నది.

చైన్నైకి తరలింపు

వివిధ దేశాల నుంచి వచ్చిన ఎఫ్‌ఐఏ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిసి కార్‌ రేస్‌ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించిన్నట్లు సమాచారం. అయితే, ఫార్ములా ఈ-ఫ్రిక్స్‌ కార్‌ రేస్‌ నిర్వహణ వల్ల రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి ఏవిధంగా ప్రభావితం చేస్తుందో వివరాలను అందించాలని ప్రభుత్వం ఎఫ్‌ఐఏను కోరింది. ఈ స్వల్ప సమయంలో ప్రభుత్వానికి వివరించడం, రేస్‌ నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించడం సాధ్యమేనా అని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. అయితే హుస్సేన్‌సాగర్‌ తీరాన గల స్ర్టీట్‌ సర్క్యూట్‌లోనే నవంబర్‌ 4, 5 తేదీల్లో ఇండియన్‌ రేస్‌ లీగ్‌ జరగాల్సి ఉండగా ఎన్నికల వేళ రేస్‌ నిర్వహణకు సహకారం అందించలేమని ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించినట్లు సమాచారం. దాంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్‌ రేస్‌ లీగ్‌ను రద్దు చేసి చెన్నైకి తరలించారు. రేస్‌ లీగ్‌ సమయం సమీపించాక ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేయడంతో తీవ్రంగా నష్టపోయామని లీగ్‌ నిర్వహకులు వాపోయారు.

Updated Date - Jan 03 , 2024 | 10:50 AM