Share News

Indiramma Housing: గూడు ఎప్పుడు?

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:13 AM

ఇందిరమ్మ ఇల్లు ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తోంది. నవంబరు 6న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి, 15-20వ తేదీ కల్లా ఆ జాబితాలను ఖరారు చేసి, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది.

Indiramma Housing: గూడు ఎప్పుడు?

మార్చిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం షురూ.. 8 నెలలు గడిచినా అమలేదీ?

లక్షల మంది పేదల నిరీక్షణ.. ఇందిరమ్మ కమిటీల నియామకమే పూర్తవలే

జాబితాలు ఖరారయ్యేదెప్పుడు?.. ఇళ్ల కోసం 80.54 లక్షల దరఖాస్తులు!

ఇందిరమ్మ ఇల్లు పథకం కింద అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు.. ఈ ఏడాది మార్చిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పథకాన్ని ప్రారంభించారు.. కానీ, ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు!! ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల జాబితా ఖరారుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నియమించతలపెట్టిన ‘ఇందిరమ్మ కమిటీ’లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు! దసరా, దీపావళికే ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ వివిధ వేదికలపై ప్రకటించారు. అవి కేవలం ప్రకటనలుగా మిగిలిపోయాయి! దీంతో తమకు ఇళ్లు ఎప్పుడు మంజూరవుతాయోనని లక్షల మంది పేదలు ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇల్లు ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తోంది. నవంబరు 6న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి, 15-20వ తేదీ కల్లా ఆ జాబితాలను ఖరారు చేసి, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఇప్పుడు 26వ తేదీ వచ్చినా.. దీనిపై అడుగు ముందుకు పడలేదు. ఈ పథకం కింద తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు, రెండో విడతలో స్థలం లేని వారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024-25)లో నియోజకవర్గానికి 3500-4000 చొప్పున 4.16 లక్షల ఇళ్లు.. రిజర్వ్‌ కోటాలో (సీఎం, సీఎస్‌ పరిధిలో) మరో 33,500 ఇళ్లు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై)కు అనుసంధానం చేయాలని భావిస్తోంది. అందుకు సంబంఽధించిన ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిందని పలుమార్లు చెప్పింది. కేంద్ర పథకంతో అనుసంధానమైతే అక్కడి నుంచి కొంతమేర నిధులు అందుతాయని, తద్వారా రాష్ట్రానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని భావించింది. పథకం అమలు, పర్యవేక్షణకు యాప్‌ను రూపొందించామని, త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా.. అవేమీ జరగలేదు.


  • ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు..

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. అందులో ఇందిరమ్మ ఇంటి కోసం దాదాపు 80,54,554 దరఖాస్తులు రాగా వీటిలో అర్బన్‌ పరిధిలో 23.25 లక్షలు, రూరల్‌లో 57.25 లక్షల దరఖాస్తులు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో ఆహార భద్రత కార్డులతో సరిపోలినవి 53.95 లక్షలుండగా, మరో 26.59 లక్షల దరఖాస్తులు సరిపోలలేదు. 12.72 లక్షల దరఖాస్తులు డూప్లికేషన్‌, గతంలో లబ్ధిపొందిన వారి జాబితాలో ఉన్నాయని తేల్చినట్లు సమాచారం. వీటిలో డూప్లికేషన్‌, గతంలో లబ్ధిపొందిన వారు, ఆహార భద్రత కార్డు సరిపోలని వారిని తీసివేయగా మిగిలిన దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో మరోసారి తనిఖీ చేయనున్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో 23,85,188 ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో 19,32,001 ఇళ్లు పూర్తవగా, మరో 4,53,187 ఇళ్లు పురోగతిలో ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం సేకరించిన లెక్కల్లో తేలింది. అయితే 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటి వరకు రాష్ట్రంలో గత ప్రభుత్వం 2,36,711 ఇళ్లను మంజూరు చేయగా, వీటిలో 1,58,860 ఇళ్లు పూర్తయ్యాయి. 1,36,116 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.

Updated Date - Nov 26 , 2024 | 03:13 AM