Share News

CPI: ప్రజా సమస్యలపై సమరంలో శతాబ్ది

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:33 AM

కార్మికుల సంక్షేమం, సోషలిస్టు రాజ్యస్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్లు పూర్తి చేసుకుంది.

CPI: ప్రజా సమస్యలపై సమరంలో శతాబ్ది

  • రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆవిర్భావ వేడుకలు.. ఐదు వేల గ్రామాల్లో ఎర్ర జెండా రెపరెపలు

  • 30న నల్లగొండలో శతాబ్ది ఉత్సవ ప్రారంభ సభ

  • వచ్చే ఏడాది ఆఖర్లో ఖమ్మంలో ముగింపు ఉత్సవాలు

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సంక్షేమం, సోషలిస్టు రాజ్యస్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్లు పూర్తి చేసుకుంది. 1925 డిసెంబరు ఆఖరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక మహాసభ సందర్భంగా దేశంలో ఉన్న కమ్యూనిస్టు బృందాలు అక్కడి చేరుకున్నాయి. అదే ప్రాంతంలో తొలిసారి సమావేశమయ్యాయి. 26వ తేదీన సీపీఐ ఏర్పాటును అధికారికంగా ప్రకటించారు. ఇక, స్వాతంత్ర్యానంతరం దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా సీపీఐ ఎదిగింది. సోషలిజాన్ని ఈ దేశానికి పరిచయం చేసింది. కార్మిక, కర్షక, విద్యార్థి, అభ్యుదయ రచయితలు, ప్రజానాట్యమండలి, మహిళా సంఘాలకు అంకురార్పణ చేసింది. భూ స్వామ్య వ్యవస్థ రద్దు, భూ సంస్కరణల ఆవశ్యకతపై ఉద్యమాలు చేపట్టింది. సంస్థానాల విలీనంలోనూ ప్రధాన పోరాట పాత్ర కమ్యూనిస్టు పార్టీదే. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటాన్ని చేపట్టింది. 8 గంటల పని, న్యాయబద్ధమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పోరాటాలు చేసింది. 1952 పార్లమెంట్‌ ఎన్నికల్లో 49 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ.. 16 చోట్ల విజయం సాధించింది. భువనగిరి పార్లమెంట్‌ నుంచి రావినారాయణ రెడ్డి తొలి ప్రధాన మంత్రి నెహ్రూకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు.


ఆ తర్వాత 1957 ఎన్నికల్లో 27 స్థానాలు, 1962లో 29, 1967లో 23, 1971లో 23 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. సిద్ధాంత విభేదాలతో 1964లో సీపీఐలో ప్రధాన చీలిక రాగా.. క్రమేణా 15 పార్టీలుగా చీలిపోయింది. అప్పటినుంచే సీపీఐ ప్రాభవం తగ్గడం ప్రారంభమైంది. 1977లో 7 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ... 2024 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలే దక్కించుకోగలిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ జాతీయ స్థాయి ఒరవడే కొనసాగింది. 70వ దశకం వరకు సీపీఐ బలంగానే ఉంది. 1983 అసెంబ్లీ ఎన్నికల వేళ సీపీఐతో పొత్తుకు టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్‌ ప్రయత్నించారు. 60 అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నా.. ఆ పార్టీ ఒప్పుకోలేదు. దీంతో చివరకు నాలుగు స్థానాలకే పరిమితమైంది. 1985 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టి 11 స్థానాల్లో గెలుపొందింది. 2004 ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకొని 6 స్థానాలు, 2009లో మహా కూటమిలో భాగమై నాలుగు స్థానాలు గెలుచుకుంది. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలవగా.. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ ఫిరాయించారు. తాజాగా 2023 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసి గెలుపొందారు. సిద్ధాంతాల్లో కూరుకుపోవడం, సమాజ పరిణామ క్రమంతో మారకపోవడం వంటి కారణాలతో సీపీఐ సహా అనేక కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి. శతజయంతి ఉత్సవాల సందర్భంగా కమ్యునిస్టుల పునరేకీకరణకు సీపీఐ పిలుపునిచ్చింది.


రాష్ట్ర వ్యాప్తంగా ఎర్ర జెండా రెపరెపలు

సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రంలోని 5 వేల గ్రామాల్లో అరుణ పతాకాలను పార్టీ నేతలు ఎగురవేశారు. తొలిరోజు హనుమకొండ, ఖమ్మంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈనెల 30న మధ్యాహ్నం 2 గంటలకు నల్లగొండలోని ఎంజీ కళాశాల మైదానంలో శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభను నిర్వహించనున్నట్లు సీపీఐ ప్రకటించింది. పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది. ముగింపు ఉత్సవాల్లో భాగంగా 2025 డిసెంబరు 26న ఖమ్మంలో సుమారు 2 లక్షల మందితో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - Dec 28 , 2024 | 05:33 AM