Share News

TS News: కూల్చితే కూలడానికి కాంగ్రెస్‌.. కాళేశ్వరం కాదు

ABN , Publish Date - Feb 09 , 2024 | 03:55 AM

‘‘ మా ప్రభుత్వాన్ని కూలుస్తమంటున్నరు. కూలిస్తే కూలడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమైనా మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా? నాసిరకం సిమెంట్‌తో కట్టింది కాదు. 130 ఏళ్ల పునాది ఉన్న పార్టీ..! మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది’’ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు

TS News: కూల్చితే కూలడానికి కాంగ్రెస్‌.. కాళేశ్వరం కాదు

130 ఏళ్ల పునాది కాంగ్రెస్‌ పార్టీది

అంతర్యుద్ధం బీఆర్‌ఎస్‌లోనే

తోపు అన్న కేసీఆర్‌ కామారెడ్డిలో ఎందుకు తుస్సుమన్నడు

వేముల ప్రశాంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్‌

నాకు పదవులు అవసరం లేదు

కాంగ్రెస్‌కు నేనే ఒక వెపన్‌ అని వెల్లడి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ‘‘ మా ప్రభుత్వాన్ని కూలుస్తమంటున్నరు. కూలిస్తే కూలడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమైనా మీరు కట్టిన కాళేశ్వరం అనుకుంటున్నారా? నాసిరకం సిమెంట్‌తో కట్టింది కాదు. 130 ఏళ్ల పునాది ఉన్న పార్టీ..! మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది’’ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు. తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి... పెద్ద తోపు అన్న కేసీఆర్‌.. కామారెడ్డిలో ఎందుకు తుస్సుమన్నడని ప్రశ్నించారు. హరీశ్‌రావు దగ్గర కాళేశ్వరం డబ్బులు ఉన్నాయి కాబట్టి.. సంగారెడ్డిలో రూ.60 కోట్లు పంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకున్నాడని ఆరోపించారు. తన దగ్గరా రూ.60 కోట్లు ఉంటే.. బీఆర్‌ఎ్‌సకు అక్కడ డిపాజిట్‌ కూడా దక్కేది కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని జగ్గారెడ్డి.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఏం టచ్‌ చేస్తడంటూ ప్రశాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. తాను బీఆర్‌ఎస్‌ టార్గెటెడ్‌ లీడర్‌నని జగ్గారెడ్డి చెప్పారు. తనతో పాటుగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీథర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వంటి వాళ్లు టార్గెటెడ్‌ లీడర్లుగా ఉన్నారన్నారు. తమ లాంటి వారి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ రూ.60 కోట్ల వరకు ఖర్చు చేసిందన్నారు. ఆ పార్టీ దగ్గర కాళేశ్వరం డబ్బులు ఉన్నాయని, తమ దగ్గర అప్పులు తప్ప ఏమున్నాయన్నారు. హరీశ్‌రావు నల్లధనం ఎక్కడ పెట్టారో సీఎం రేవంత్‌రెడ్డికి చెబుతానని, అన్ని లెక్కలూ బయటికి రావాలని అన్నారు. ఎదుటి వాడు ఏమంటాడో ప్రశాంత్‌రెడ్డి ఆలోచించి మాట్లాడాలని, ఎక్కువ మాట్లాడితే అన్నీ బయటికి తీస్తామన్నారు. ‘‘ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు సీఎంను కలవగలిగేవారా? కేటీఆర్‌, హరీశ్‌రావు దగ్గరికి పోయేవాళ్లు.

ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చినా మా సీఎం కలుస్తున్నడు’’ అన్నారు. కుట్రలు చేస్తే.. 20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలోకి వచ్చి తీరుతారన్నారు. జగ్గారెడ్డికి పదవులు అవసరం లేదని, కాంగ్రెస్‌ పార్టీకి తానే ఒక ఆయుధమని చెప్పారు. ఆయుధానికి పదవులు అవసరం లేదన్నారు. ‘‘ మీకు పోస్టులు ఉంటేనే లీడర్లు. నేను బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే లీడర్‌ అయ్యా. జగ్గారెడ్డి అంటే బ్రాండ్‌. మీలెక్క ఎవరి పేరో చెప్పి నాయకుడిని కాలేదు’’ అంటూ ప్రశాంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అంతర్యుద్ధం కాంగ్రెస్‌ పార్టీలో కాదు.. బీఆర్‌ఎ్‌సలోనే జరిగి తీరుతుందన్నారు. కేసీఆర్‌కు వెనక నుంచి గడ్డపార గుచ్చడానికి హరీశ్‌రావు సిద్ధంగా ఉన్నాడన్నారు. ముస్లింలు, ఎస్టీలకు ఇస్తానన్న రిజర్వేషన్‌, నిరుద్యోగ భృతి బీఆర్‌స్‌ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమ పైన రాజకీయ బురద చల్లితే.. ఊరుకోమని, వారు అమలు చేయని హామీలపైనా వారిని నిలదీస్తామని స్పష్టం చేశారు. ప్రోటోకాల్‌ ఇవ్వడం విషయంలో.. బీఆర్‌ఎస్‌ పార్టీ చూపిన దారిలోనే తామూ నడుస్తున్నామన్నారు. కేసీఆర్‌ రాసిన స్ర్కిప్టు చదవడం తప్ప ప్రశాంత్‌రెడ్డికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 09 , 2024 | 07:15 AM