Share News

ఓసారి ఇంటికిరా కొడుకా..!!

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:53 AM

‘‘ఇంటికి రా... కొడుకా.. చావుకు దగ్గరవుతున్నా.. నీ ముఖం చూడాలని ఉంది.. నా కళ్లు పోయే, కాళ్లు పోయే, చేతులు పోయే’’.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శి బడే చొక్కరావు అలియాస్‌ దామోదర్‌ తల్లి బతుకమ్మ ఆవేదన ఇది.

ఓసారి ఇంటికిరా కొడుకా..!!

  • చావుకు దగ్గరవుతున్నా.. నీ ముఖం చూడాలని ఉంది

  • మావోయిస్టు నేత దామోదర్‌ తల్లి ఆవేదన

మేడారం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఇంటికి రా... కొడుకా.. చావుకు దగ్గరవుతున్నా.. నీ ముఖం చూడాలని ఉంది.. నా కళ్లు పోయే, కాళ్లు పోయే, చేతులు పోయే’’.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శి బడే చొక్కరావు అలియాస్‌ దామోదర్‌ తల్లి బతుకమ్మ ఆవేదన ఇది. వృద్ధాప్యం, అనారోగ్యంతో అవస్థలు పడుతున్న ఆ తల్లి తన కొడుకు కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్నవారిని జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు పోలీసు శాఖ చేపట్టిన ‘పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి’ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్‌.. దామోదర్‌ తల్లి బతుకమ్మను శుక్రవారం కలిశారు.


తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యులతో ఆమెకు పరీక్షలు చేయించారు. బతుకమ్మ నరాల బలహీనత, కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నదని గుర్తించారు. ఎస్పీతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన బతుకమ్మ.. తన కొడుకును చూడాలని ఉంది అంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 103 మంది తమ కుటుంబాలను వదిలి మావోయిస్టుల్లో చేరి ఏళ్లుగా అజ్ఞాతంలో జీవిస్తున్నారని తెలిపారు. వారంతా లొంగిపోయి తిరిగి తమ కుటుంబసభ్యులతో సంతోషంగా జీవించాలని సూచించారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన వారికి రిలీఫ్‌ ఫండ్‌, ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 28 , 2024 | 05:53 AM