CM Revanth Reddy: త్వరలో సీఎం చేతుల మీదుగా.. టీజీఆర్‌సీ కొత్త భవనం ప్రారంభోత్సవం
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:28 AM
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఆర్‌సీ) కొత్త భవనంలో కొలువుదీరింది.
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఆర్‌సీ) కొత్త భవనంలో కొలువుదీరింది. మరో 10 రోజుల్లో కొత్త ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఎర్రగడ్డ కల్యాణ్‌నగర్‌లోని జీటీఎస్ కాలనీలో ‘విద్యుత్ నియంత్రణ్ భవన్’ పేరిట కొత్త భవనాన్ని నిర్మించారు. తొలుత లక్డీకాపూల్‌లో కట్టాలని శంకుస్థాపన చేయగా... ఆ తర్వాత భూవివాదాలతో కల్యాణ్‌నగర్‌కు తరలించారు.
దక్షిణ డిస్కమ్‌కు చెందిన కార్యాలయాలు ఉన్నచోట దీని నిర్మాణం చేపట్టగా ఇటీవలే పనులు పూర్తయ్యాయి. కొత్త కార్యాలయాన్ని కమిషన్ నోటిఫై చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త ప్రాంగణంలో కార్యకలాపాలు ప్రారంభం కాగా భవనాన్ని లాంఛనంగా ఈ నెల 18-21వ తేదీల మధ్య ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెడ్‌హిల్స్‌లోని సింగరేణిభవన్‌లో కార్యాలయం నడుస్తోంది.